స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పెద్ద సమస్య వచ్చిపడింది. అధికారపార్టీ నుండో లేకపోతే ప్రభుత్వం నుండో నిమ్మగడ్డకు సమస్యలు ఎదురుకావటం మామూలే. కానీ అనూహ్యంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నుండి తనకు సమస్య వస్తుందని బహుశా నిమ్మగడ్డ కూడా అనుకునుండరు. చంద్రబాబు+నిమ్మగడ్డది ఒకటే రాజకీయ డిఎన్ఏ అంటూ మంత్రులు పదే పదే చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన అవసరం ఇపుడు కమీషనర్ కు ఎదురైంది. ఇంతకీ జరిగిందేమంటే ‘పల్లె ప్రగతికి పంచసూత్రాలు’ అనే పేరుతో చంద్రబాబు పార్టీ తరపున ఓ పిచ్చి మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
నిజానికి స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రత్యేకించి మ్యానిఫెస్టోను విడుదల చేయదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రత్యేకించి మ్యానిఫెస్టోను విడుదల చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి. ఇక పంచాయితి ఎన్నికలంటేనే పార్టీరహితంగా జరిగే ఎన్నికలని అందరికీ తెలిసిందే. పోటీ చేసే అభ్యర్ధులకు పార్టీల ఎన్నికల గుర్తులుండవు కాబట్టే ఏ పార్టీ కూడా మ్యానిఫెస్టోను విడుదల చేయదు. మరి ఈ విషయాలు బాగా తెలిసిన చంద్రబాబు ప్రత్యేకించి ఎందుకని మ్యానిఫెస్టోను విడుదల చేశారు ? ఈ విషయాన్ని పార్టీ నేతలు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సరే వీళ్ళ గోల ఎలాగున్నా చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టోను వైసీపీ నేతలు గట్టిగా పట్టుకున్నారు.
పంచాయితీ ఎన్నికల్లో మ్యానిఫెస్టో విడుదల చేయటం పంచాయితీ రాజ్ చట్టానికి విరుద్ధమని వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నిబంధనలు తెలిసీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబుపై కమీషనర్ నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా మ్యానిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ గట్టిగా పట్టుబట్టారు. ఇదే విషయమై నిమ్మగడ్డకు వైసీపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మరి ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు లేకపోతే టీడీపీపై నిమ్మగడ్డ అసలు చర్యలు తీసుకుంటారా ? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది. మంత్రులు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబుది తనది ఒకటే రాజకీయ డిఎన్ఏ కాదని చెప్పాలంటే ఇఫుడు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. లేకపోతే మంత్రులు చెప్పిందే నిజమైపోతుంది.