తన ప్రత్యర్ధులకు అచ్చం కేసీయార్ లాగ జగన్మోహన్ రెడ్డే ఆయుధాలు అందిస్తున్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాలు చేసే రాజకీయ ఆరోపణలను పక్కనపెట్టేద్దాం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు రెచ్చిపోతున్నారు. తనకు మద్దతుగా నిలిచే ఎల్లోమీడియా కూడా 24 గంటలు జగన్ వ్యతిరేక జపాన్నే చేస్తోంది. లేని వివాదాలను సృష్టించటం, చిన్న వివాదాలను కూడా బూతద్దంలో చూపించి పెద్దవి చేసేయటంలో టీడీపీ+ఎల్లోమీడియా కలిసికట్టుగా చాలా కష్టపడుతున్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు చేసే ఆరోపణల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనే అనుకుందాం. కానీ రిపీటెడుగా జరుగుతున్న వ్యవహారా మాటేమిటి ? ఇందులో కూడా ప్రతిపక్షాల హస్తముందా ? ఉంటే ఎవరు చేయిస్తున్నారు ? అన్న విషయాలను జగన్ ప్రభుత్వం ప్రజలముందుంచాలి కదా ?
గడచిన కొద్ది నెలలుగా ఓ పద్దతి ప్రకారం హిందు దేవాలయాలపై దాడులు జరుగుతున్న మాట వాస్తవం. అంతర్వేదిలో రథం దగ్దం కావచ్చు లేదా దేవుళ్ళ విగ్రహాల ద్వంసం కూడా కావచ్చు. ఇంతవరకు చాలా ఘటనలే జరిగినా ఎందులోను నిందితులను పట్టకున్న దాఖలాలు లేవన్నది నిజం. రథం దగ్దమైతే కొత్త రథం తయారు చేయించటం, విగ్రహాలు పగిలిపోతే కొత్తవి చేయిస్తే సరిపోతుందా ? అసలా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ? వాటి వెనకున్న వాళ్ళు ఎవరు ? అన్న విషయాలను ప్రభుత్వం ప్రజలముందుంచాలి. ఘటన జరిగినపుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకోవటంలో ఎందుకు అలసత్వం చూపిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో జరిగితే ఏదోలే అని సరిపెట్టుకున్నా స్వయంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోనే ఊరేగింపు వెండి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్ళిపోయారు కదా. మరా ఘటనలో పోలీసులు ఏమి దర్యాప్తు చేసినట్లు ?
జగన్ సీఎం కాకముందు కూడా అంటే చంద్రబాబు హయాంలో కూడా దేవుళ్ళపైనా, దేవాలయాలపైనా చాలానే దాడులు జరిగాయి. ప్రభుత్వమే విజయవాడలో 35 గుళ్ళను కూల్చేసిన ఘటన మనకందరికీ తెలిసిందే. 35 గుళ్ళను కూల్చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాబట్టే అప్పట్లో ఎల్లోమీడియా కూడా ఏమీ జరగనట్లే ఉండిపోయింది. అప్పట్లో మిత్రపక్షం కాబట్టే బీజేపీ కూడా నోరిప్పలేదు. ఇపుడు అదికారంలో ఉన్నది జగన్ కాబట్టి రెండుపార్టీలు ఎల్లోమీడియా సహకారంతో రెచ్చిపోతున్నాయి. ఇది ప్రతిపక్షాల కుట్రని, ఎల్లోమీడియా కుట్రని రోజులు గడిపేసేందుకు లేదు. ఎందుకంటే జరుగుతున్నది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఘటనలు. ఇపుడు గనుక జగన్ ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో చాలా పెనాల్టీ పే చేయాల్సుంటుంది. ప్రతిపక్షాలే కదా ఎల్లోమీడయానే కదా ఏమి చేస్తాయిలో అని ఉపేక్షించేందుకు లేదు. ఇలా అనుకునే కేసీయార్ ఏ స్ధయి నుండి ఏ స్ధాయికి దిగిపోయారో అందరు చూస్తున్నదే. కాబట్టి సమస్యను మొదట్లోనే గుర్తించి తగిన మందు వేయకపోతే తన ప్రత్యర్ధులకు తనంతట తానే ఆయుధాలను ఇచ్చినట్లవుతుంది.