హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ పై రివర్సులో కోర్టులో కేసు

Vijaya
అవును ఎవరు నమ్మటం లేదు. అయినా నిజ్జంగా ఇది నిజమే. ఎన్నికల ప్రక్రియకు  సంబంధించి ప్రభుత్వమే ముందు జాగ్రత్తగా స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై హైకోర్టులో కేసు వేసింది. పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది నిమ్మగడ్డపై ఫిర్యాదులు చేస్తు కేసు వేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించకుండానే రానున్న ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ద్వివేది తన పిటీషన్లో ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా నిమ్మగడ్డ తుంగలో తొక్కినట్లు ద్వివేది ఆరోపించారు.  ముందు ప్రభుత్వంతో సంప్రదించకుండానే రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశ వివరాలను తన పిటీషన్లో జత చేశారు. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇంకా తెలియలేదు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు నిమ్మగడ్డే ముందుగా ప్రభుత్వంపై కేసులు వేయటం చూశారు.  ఏదో చిన్న కారణాన్ని కూడా అడ్డుపెట్టుకోవటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయటమే అందరికీ తెలిసిన విషయం. కానీ ఇపుడు మాత్రం ప్రభుత్వమే నిమ్మగడ్డపై ఉల్టాగా కేసు పెట్టింది. ఎందుకు కేసు వేసిందంటే ఎలాగైనా వచ్చే ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలలో ఉన్నారు నిమ్మగడ్డ. ఏప్రిల్ నెలలో తాను రిటైర్ అయ్యేలోగ తన హయాంలోనే ఎన్నికలు జరపాలనే పట్టుదల నిమ్మగడ్డలో కనబడుతోంది. అయితే నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎట్టి పరిస్ధితుల్లోను ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉంది. మొన్నటి మార్చిలో అయిపోవాల్సిన ఎన్నికలను కరోనా వైరస్ బూచిగా చూపించి నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేశారు. నిజానికి అప్పడు రాష్ట్రంలో ఒకటి రెండు కేసులకన్నా లేదు. అయినా సరే కావాలనే ఎన్నికలను వాయిదా వేసేశారు.



ఇపుడు ప్రభుత్వం అదే అస్త్రాన్ని నిమ్మగడ్డపై తిరిగి ప్రయోగించింది. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చీఫ్ సెక్రటరీ చెప్పారు. నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఆమె మాత్రం ఒకటే సమాధానం చెబుతున్నారు. తాజాగా కోర్టులో వేసిన పిటీషన్లో కూడా కరోనా వైరస్ కేసుల వ్యాప్తి, మరణాలు తదితరాలను ప్రస్తావించింది ప్రభుత్వం. వేలాది కేసులు నమోదవుతున్న నేపద్యంలో ఇపుడు ఎన్నికలు నిర్వహించటం ప్రజా సంక్షేమం దృష్ట్యా మంచిది కాదని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని ద్వివేది స్పష్టంగా చెప్పారు. కాబట్టి కేసుల ఉదృతి తగ్గేవరకు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ అంశాన్ని టేకప్ చేయద్దని నిమ్మగడ్డను ఆదేశించమని ద్వివేది కోర్టును కోరారు. మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: