హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీతో పోటి పడుతున్న చంద్రబాబు..ఏ విషయంలోనో తెలుసా ?
విచిత్రమేమిటంటే బీజేపీ కన్నా టీడీపీ పరిస్దితి భిన్నంగా లేకపోవటమే. కేవలం రెండు పార్టీల మధ్య తేడా ఏమిటంటే టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలున్నారు. బీజేపీకి రాష్ట్రం నుండి చట్టసభల్లో ఎటువంటి ప్రాతినిధ్యము లేదంతే. నేతల వ్యవహార శైలి, కార్యకర్తల బలగం అన్నింటిలోను రెండు పార్టీల్లోను ఎటువంటి తేడా కనబడటం లేదు. ప్రభుత్వం తరపున జరుగుతున్న లోపాలను, వైసిపి నేతల్లో కొందరు చేస్తున్న ఓవర్ యాక్షన్ పై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటానికి ప్రతిపక్షాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయినా వేటినీ అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్ధితుల్లో ప్రతిపక్షాలు లేకపోవటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఉదాహరణకు తీసుకుంటే అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం రథం దగ్దం అయిన విషయం చూద్దాం. రథం దగ్దం కాగానే జగన్మోహన్ రెడ్డిపై హిందు వ్యతిరేకిగా ముద్ర వేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ముందు మతపరమైన రాజకీయాలు బిజెపి నేతలు మొదలుపెట్టారు. దీంతో తామెక్కడ వెనకబడిపోతామో అన్న టెన్షన్ తో వెంటనే చంద్రబాబు కూడా నానా యాగీ మొదలుపెట్టేశాడు. ఘటనపై విచారణకు జగన్ ఎప్పుడైతే సీబీఐ విచారణకు ఆదేశించాడో వెంటనే బీజెపీ నేతలు ఆందోళన నుండి వెనక్కు తగ్గారు. దాంతో ఏమి చేయాలో తెలీక చంద్రబాబు ముందు గింజుకున్నాడు. తర్వాత హిందువుల తరపున పోరాటం చేయటమే తమ లక్ష్యంగా కాస్త హడావుడి చేసిన టిడిపి తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.