రాష్ట్ర అధ్యక్షపదవి నుండి మూడేళ్ళ కారలపరిమితి తీరకుండానే బిజెపి అగ్రనాయకత్వం కన్నా లక్ష్మీనారాయణను అర్ధాంతరంగా తొలగించటం సంచలనంగా మారింది. నాయకత్వ బాధ్యతలు మారుతాయని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నా అవన్నీ పుకార్లే అంటూ కొందరు సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. కాలపరిమితి తీరకుండా తనను పదవిలో నుండి తొలగించే అవకాశం లేదని కన్నా కూడా ధీమాగా ఉన్నాడు. అయితే ఊహించని రీతిలో సోమవారం సాయంత్రం కన్నాను తప్పించిన అధిష్టానం మరో సీనియర్ నేత, ఎంఎల్సీ సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించింది. 2018లో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రెండేళ్ళకే తొలగించటమంటే కన్నాను అవమానించటమనే అనుకోవాలి. ఎందుకంటే గతంలో ఎవరినీ కాలపరిమితి తీరకుండా తొలగించలేదు. కంభంపాటి హరిబాబు అయితే తనను అధ్యక్షపదవి నుండి తొలగించమని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోని అధిష్టానం తాజాగా కన్నాను మాత్రం అర్ధాంతరంగా ఎందుకు తొలగించింది ?
ఎందుకంటే కొంతకాలంగా కన్నా పార్టీ లైన్ లో కాకుండా తన సొంత అజెండాతో వ్యవహారాలు నడుపుతున్నాడనే ఆరోపణలు పార్టీలోనే బాగా వినబడుతున్నాయి. టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన నలుగురు ఎంపిల్లో సుజనా చౌదరి ఒకడు. కన్నా మీద సుజనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందనే ప్రచారం పార్టీలోనే జరిగింది. సుజనా ప్రభావం కన్నాపై ఎందుకుందంటే చంద్రబాబునాయుడుకు అనుకూలంగానే అనే ఆరోపణలు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి కూడా వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన చంద్రబాబుకు కన్నా కూడా గుడ్డిగా మద్దతుగా నిలబడుతున్నాడనే ప్రచారం బాగా పెరిగిపోయింది. కన్నా వ్యవహార శైలి కూడా దానికి తగ్గట్లే ఉండేది. జగన్ ను చంద్రబాబు ఏ అంశాల్లో అయితే వ్యతిరేకించాడో అవే అంశాలపై కన్నా కూడా వ్యతిరేకించేవాడు.
జగన్ను వ్యతిరేకించటంలో చంద్రబాబు-కన్నా మధ్యలో పెద్ద తేడా ఏమీ పార్టీ నేతలకు కనబడలేదు. ముఖ్యంగా రాజధాని, ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపులాంటి అంశాలపై చంద్రబాబు, కన్నా కూడబలుక్కునే ఆరోపణలు చేస్తున్నారా ? అనే అనుమానాలు కూడా పెరిగిపోయాయి. అంటే అంత స్ధాయిలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు అందరికీ అర్ధమైపోయింది. దాంతో బిజెపి లైనులో కాకుండా చంద్రబాబు కోసమే కన్నా రాజకీయాలు చేస్తున్నాడనే అనుమానం బలపడిపోయింది. సరే ఇటువంటి అనేక ఆరోపణలు కన్నాపై అగ్రనాయకత్వానికి చేరటంతో కన్నా తొలగింపు అనివార్యమని తేలిపోయింది. కాకపోతే హఠాత్తుగా సోమవారం రాత్రి తొలగిస్తారని అయితే ఎవరూ అనుకోలేదు. కన్నాను తొలగించటంలో చంద్రబాబు పుణ్యమే ఎక్కువగా ఉందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
ఇక కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న సోము వీర్రాజు కూడా జనాల్లో చొచ్చుకుపోయే మనిషైతే కాదు. కాకపోతే ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుండి వచ్చాడు కాబట్టి పార్టీలో బలమైన వర్గం మద్దతుంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా పార్టీలోనే నిబద్దతతో పనిచేస్తున్నాడు. అదే సమయంలో సోముకు చంద్రబాబు అంటే ఏమాత్రం గిట్టదు. చంద్రబాబు మీద ఆరోపణలు చేయాలంటే ఉన్నపళంగా సోము ఒంటికాలిపై లేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే సమయంలో చంద్రబాబును అనుసరించడనే అందరు అనుకుంటున్నారు. అలాగని జగన్ కు మద్దతుగా రాజకీయాలు చేస్తాడని కూడా ఎవరూ అనుకోవటం లేదు. ప్రభుత్వ పరంగా తప్పుంటే తప్పు ఒప్పయితే ఒప్పు అనే తరహాలో సోము వెళతాడని అనుకుంటున్నారు. ఏదేమైనా కన్నాను అర్ధాంతరంగా అధ్యక్షుడిగా తొలగించటమంటే చంద్రబాబుకే కాకుండా బిజెపిలో ఉన్న చంద్రబాబు మద్దతుదారులకు కూడా షాకనే చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: