కలుగులోని ఎలుకలను బయటకు రప్పించాలంటే కలుగుల్లో పొగ పెట్టాలి. పొగకు ఉక్కిరి బిక్కిరయ్యే ఎలుకలు బయటకు పరిగెత్తుకు వస్తాయి. ఇపుడు తెలుగుదేశంపార్టీలోని కొందరు సీనియర్ల పరిస్ధితి కూడా ఇలాగే తయారైనట్లుంది. ఘోరంగా ఓడిపోయి తర్వాత అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడిన వారిలో కొందరు బయటపడుతున్నారు. మొదట మాజీమంత్రి కంజరాపు అచ్చెన్నాయుడుతో మొదలైంది అరెస్టుల వ్యవహారం. రూ. 157 కోట్ల ఇఎస్ఐ భారీ అవినీతిలో అచ్చెన్నపై ఏసిబి కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అప్పట్లో అచ్చెన్న ఒత్తిడికి లొంగిపోయిన వాళ్ళో లేకపోతే సహకరించిన వాళ్ళో మొత్తంమీద తొమ్మిది మంది అధికారులు కూడా అరెస్టయ్యారు.
తాజాగా మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చుట్టూ ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. విచిత్రమేమిటంటే ఈయనకు కూడా ఇఎస్ఐ స్కాంలో భాగస్వామ్యం ఉన్నదట. అచ్చెన్నేమో అధికారులపై ఒత్తిళ్ళు పెట్టి మందులు, వైద్య పరికరాలను అనవసరంగాను, అధిక ధరలకు కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొనుగోళ్ళు చేయించటం, ఆర్డర్లు పెట్టించటం వరకు అచ్చెన్న మంత్రిగా ఉన్నాడు. తర్వాత వంతు పితాని సత్యనారాయణది. అంటే ఇఎస్ఐ స్కాంలో పితాని రెండో కృష్ణుడున్నమాట. అచ్చెన్న ప్లేసులో మంత్రి అయిన పితాని బిల్లుల చెల్లింపులో చేతివాటం ప్రదర్శించాడనే ఆరోపణలు వినబడుతున్నాయి.
అయితే పితానికి బదులు ఆయనకు పిఎస్ కు పనిచేసిన మురళీకృష్ణ, పితాని కొడుకు పితాని సురేష్ కుమార్ బిల్లుల చెల్లింపు తదితరాల్లో కీలక పాత్ర పోషించారట. తమపైన కూడా ఏసిబి ఉన్నతాధాకారులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారనే భయం ఉన్నట్లుంది. అందుకనే హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నారు. అవినీతిలో పాత్ర లేకపోతే అరెస్టు భయం ఎందుకుంటుంది ఎవరికైనా ? ఇప్పటికే మురళిని ఏసిబి అధికారులు అరెస్టు చేశారు. సురేష్ కోసం ఉన్నతాధికారులు హైదరాబాద్ కు చేరుకున్నారట. మరి ఆ ముచ్చట ఎప్పుడు పూర్తవుతుందో చూడాల్సిందే.
ఈ మధ్యలో వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కుట్రలో మరో మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హత్యకుట్ర ఆరోపణల్లో కొల్లును పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సరే ఈ విషయం కోర్టు చూసుకుంటుంది. ఇక మరో సీనియర్, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్పలు ముందస్తు బెయిల్ మీద తిరుగుతున్నారు. వీళ్ళల్లో చింతకాయలపై నిర్భయ కేసు నమోదైతే మిగిలిన ఇద్దరిపైన ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వాళ్ళు ఇపుడు ఒక్కొక్కళ్ళు తగులుకుంటున్నట్లున్నారు. చూద్దాం ఎంతమంది తగులుకుంటారో
మరింత సమాచారం తెలుసుకోండి: