హెరాల్డ్ ఎడిటోరియల్ :   అనర్హత వేటుకన్నా ముందే ఎంపికి షాక్ ?

Vijaya
పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు లేవదీసిన  నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కు పెద్ద షాకివ్వటానికి పార్టీ నాయకత్వం పకడ్బందీగా పావులు కదుపుతోంది. పార్టీ లైనుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే సవాలు చేస్తున్న ఎంపిపై అనర్హత వేటు  వేయాలని ఇప్పటికే పార్టీ ఎంపిలు స్పీకర్ ఓంబిర్లాకు లేఖ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తనపై అనర్హత వేటుపడే అవకాశమే లేదని మొదట్లో మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించిన ఎంపిలో తర్వాత టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తోంది. అందుకనే అనర్హత వేటును తప్పించుకునేందుకు హైకోర్టులో కూడా కేసు వేశాడు. నిజానికి అనర్హత వేటు వేయాలని  స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఏ కోర్టు కూడా ఆపలేందన్న విషయం అందరికీ తెలిసిందే.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే  అనర్హత వేటుకన్నా ముందే ఎంపికి గట్టి షాక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. పార్లమెంటుకు సంబంధించిన ఓ కమిటికి ఛైర్మన్ గాను అనేక కమిటిల్లో సభ్యుడిగాను కృష్ణంరాజు కంటిన్యు అవుతున్నారు. ముందు ఆ పదవులన్నింటినీ ఊడబీకాలని వైసిపి ప్లాన్ చేసింది. కమిటి ఆన్ సబార్డినేట్ లెసిస్ట్లేషన్ ఛైర్మన్ పదవి తనకు వైసిపి ఎంపిగా రాలేదని ఇప్పటికే చాలాసార్లు ఎంపి ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వంతో తనకున్న సన్నిహితం కారణంగానే తనకు పదవి వచ్చింది కానీ వైసిపి ఎంపి హోదాలో కాదని చెప్పాడు. అలాగే కమిటి ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్, స్టాండింగ్ కమిటి ఆన్ కోల్, స్టీల్, రూల్స్, లోక్ సభ జనరల్ పర్పస్ కమిటి, విద్యుత్, ఇందన వనరుల పునరుత్పాదక వనరుల కన్సల్టేటివ్ కమిటిల్లో సభ్యుడిగా ఉన్నాడు.

పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపిలందరినీ పార్లమెంటు సెక్రటేరియట్ ఏదో ఓ కమిటిలో సభ్యుడిగా అవకాశం ఇస్తుంది. ఈ నియామకం కూడా పార్టీ నాయకత్వం సిఫారసుల ఆధారంగానే జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఎంపిల సీనియారిటి ప్రకారం కమిటిల్లో ప్రాధాన్యత ఉంటుంది. అయితే కృష్ణంరాజు మాత్రం తనను తాను ఎక్కువగా ఊహించుకున్నట్లు కనిపిస్తోంది. మొదటిసారి ఎంపిగా గెలిచిన కృష్ణంరాజు ఓ కమిటికి ఛైర్మన్ గా అపాయింట్ అవ్వటమే ఆశ్చర్యం. సరే అపాయింట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తి తన సొంత బలం వల్లే కమిటి ఛైర్మన్ అయినట్లు చాలాసార్లు బహిరంగంగానే చెప్పటం విచిత్రం. అంటే ఎంపి మాటలు ఎలాగున్నాయంటే పార్టీకన్నా తానే గొప్పొణ్ణి అన్నట్లుగా అర్ధమవుతోంది. ఇక్కడే ఎంపికి పార్టీకి మధ్య సమస్య మొదలైంది.

సరే తర్వాత ఎంపికి జగన్ పై అనేక  సందర్భాల్లో నోరు పారేసుకోవటం, పార్టీ లైన్ను ధిక్కరిస్తు మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో షోకాజ్ నోటీసిచ్చిన పార్టీపైన కూడా ఎంపి నోటికొచ్చినట్లు మాట్లాడాడు.  దాంతో  ఎంపిపై అనర్హత వేటు వేయించాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ వెంటనే అందుకు తగ్గట్లుగా స్పీకర్ కు లేఖ కూడా ఇప్పించాడు. అయితే దానికన్నా ముందే   ఎంపి కమిటి ఛైర్మన్ పదవితో పాటు వివిధ కమిటిల్లో సభ్యత్వాలను కూడా ఊడబీకించేందుకు పావులు కదుపుతోంది. ఎంపి ఛైర్మన్ పదవితో పాటు సభ్యుడిగా కమిటీల నుండి తొలగించాలంటూ స్పీకర్ కు ఓ లేఖ రాసింది. ఇదే గనుక జరిగితే ఎంపిపై అనర్హత వేటు పడటం కూడా ఖాయమనే అనుకోవాలి. కాకపోతే ఎప్పుడన్నదే సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: