కృతిమ సూర్యుడుని సృష్టించే దిశ‌గా చైనా ముంద‌డుగు..!

N ANJANEYULU
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటే భానుడిలో శ‌క్తి ఉత్ప‌త్తి చేసే సంక్లిష్ట ప్ర‌క్రియ‌ను భూమిపై సాధించ‌డం చుట్టూ చైనా తిరుగుతూ ఉంది. కృతిమ సూర్యుడిని సాకారం చేసి భారీగా, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌ద్ద‌తిలో విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంది చైనా. ఇటీవ‌ల కీల‌క ముందుడ‌గు కూడా వేసింది. 70 మిలియ‌న్ డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద రికార్డు స్థాయిలో 1,056 సెక‌న్ల కాలం పాటు రియాక్ట‌ర్‌ను ప‌ని చేయించింది. సూరుని కోర్ భాగంలోని ఉష్ణోగ్రత క‌న్నా5 రెట్లు అధికం.
ఇంత సుదీర్ఘ‌కాలం పాటు అధిక ఉష్ణోగ్ర‌త ప్లాస్మా ఆప‌రేష‌న్ కొన‌సాగ‌డం ప్ర‌పంచంలోనే ఇదే మొద‌టిసారి. కేంద్ర‌క సంలీన చ‌ర్య. విశ్వంలో ప్ర‌ధాన శ‌క్తి వ‌న‌రు, సూర్యుడు ఇత‌ర న‌క్ష‌త్రాల‌లో జ‌రిగే ప్ర‌క్రియ ఇదే. మ‌నం చూస్తున్న కాంతి, అనుభ‌విస్తున్న వేడి, సూర్యుడి కేంద్ర భాగంలో జరుగుతున్న సంలీన చ‌ర్య ఫ‌లిత‌మే. కేంద్ర‌క విచ్చితి ప్ర‌క్రియ కేంద్రకాన్ని రెండు విడగొట్టడం ద్వారా శ‌క్తిని ఉత్ప‌త్తిని చేస్తారు. సంలీన చ‌ర్య‌లో రెండు తేలిక పాటి కేంద్రకాల‌ను క‌లిపి ఒకే భార కేంద్రకాన్ని వెలువ‌రిస్తారు.
న‌క్ష‌త్రాల‌లో రెండు హైడ్రోజ‌న్ కేంద్రకాలు విలీన‌మై, హీలియం, కేంద్ర‌కం ఏర్ప‌డుతుంది. అదే రీతిలో హైడ్రోజ‌న్ ఫ్యూజ‌న్ ను  భూమిపై నియంత్రిత ప‌ద్ద‌తిలో సాధించాల‌ని శాస్త్రవేత్త‌లు 70 ఏళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తూ ఉన్నారు. టోకామాక్ రియాక్ట‌ర్‌ను ఇందుకోసం ఉప‌యోగిస్తున్నారు. ఇందులో హైడ్రోజ‌న్ వినియోగిస్తూ.. హైడ్రోజ‌న్ ఐసోటోపులు అయిన డ్యూటీరియం, ట్రిటియంల‌ను ఇంధ‌నంగా వాడుతున్నారు. వీటి కేంద్రకాలు విలీన‌మ‌య్యే క్ర‌మంలో హీలియం, భారీగా శ‌క్తి వెలువ‌డుతుంది. దీనిసాయంతో విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు.
డ్యూటీరియం, ట్రిటియం క‌ల‌యిక అంత సులువుగా జ‌ర‌గ‌దు. న‌క్ష‌త్రాల కోర్ భాగంలో అసాధార‌ణ వేడి, పీడ‌నం వ‌ద్ద మాత్ర‌మే కేంద్రంక సంలీన చ‌ర్య జ‌రుగుతుంది. టోకామాక్ రియాక్ట‌ర్ల‌లో వాటిని సృష్టించ‌డం కొనసాగించ‌డం పెద్ద స‌వాలే. టోకామాక్‌లో హైడ్రోజ‌న్ ఐసోటోపుల‌ను 150 మిలియ‌న్ డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌కు అపార పీడ‌నానికి గురి చేయాలి. దీనివ‌ల్ల ప్లాస్మా ఏర్ప‌డుతుంది. ఈ ప్లాస్మాను రియాక్ట‌ర్ చాంబ‌ర్‌లో శ‌క్తిమంత‌మైన అయ‌స్కాంత క్షేత్రాల సాయంతో అదుపులో ఉంచాలి. ఇది పొర‌పాటున రియాక్ట‌ర్ గోడ‌ల‌ను తాకితే త‌న ఉష్ణాన్ని కోల్పోతుంది. ఈ ప్లాస్మా సంలీన చ‌ర్య‌కు వీలు క‌ల్పిస్తుంది.
అయితే వ‌చ్చే వందేండ్ల‌లో ఇంద‌న డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. శిల‌జ ఇంధ‌నాల వ‌ల్ల భారీగా గ్రీన్‌హౌస్ వాయువులు వెలువ‌డి కాలుష్యం పెరుగుతుంది. ఈ స‌మ‌స్య‌ల‌కు కేంద్ర‌క సంలీన చ‌ర్య‌ల విధానంతో చెక్ పెట్ట‌వ‌చ్చు. బొగ్గు, గ్యాస్ వంటివి మండించ‌డం ద్వారా జ‌రిగే ర‌సాయ‌న చ‌ర్య‌ల‌తో పోలిస్తే కేంద్ర‌క సంలీన చ‌ర్య‌వ‌ల్ల 40ల‌క్ష‌ల రెట్లు ఎక్కువ శ‌క్తి వెలువ‌డుతంది. కేంద్ర‌క విచ్చిత్తితో పోల్చితే నాలుగు రెట్ల శ‌క్తి విడుద‌ల‌వుతుంది.
కేంద్ర‌క సంలీన రియాక్ట‌ర్‌తో ఉన్న ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇండియా కూడా దానిపై దృష్టి సారించింది. 1989లో ఆదిత్య పేరుతో ఒక టొకామాక్‌ను అభివృద్ధి చేసి ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తుంది. అయితే ఒక బాత్‌ట‌బ్ ప‌రిమాణంల‌ని నీటిలో ఉన్న డ్యూటిరియంను.. రెండు ల్యాప్‌టాప్ బ్యాట‌రీల్లోని లిథియం ద్వారా ఉత్ప‌త్తి చేసే ట్రిటియంతో క‌ల‌ప‌డం ద్వారా ఒక వ్య‌క్తి జీవిత‌కాలానికి స‌రిప‌డా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల విద్యుత్‌ను ఉత్ప‌త్తిచేయ‌వ‌చ్చు. ఇందులో వాడిన స్వ‌ల్ప స్థాయి ఇంధ‌నం 230 ట‌న్నుల బొగ్గుతో స‌మానం.  మ‌రొక‌వైపు అంత‌ర్జాతీయ థ‌ర్మో న్యూక్లియ‌ర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్ట‌ర్ పేరుతో అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన భాగ‌స్వామ్యంతో భార‌త్ చేయి క‌లిపింది. ఈ రియాక్ట‌ర్ ఫ్రాన్స్‌లో సిద్ధ‌మ‌వుతున్న‌ది. చైనా, ఐరోపా సంఘం, జ‌పాన్‌, కొరియా, ర‌ష్యా, అమెరికా కూడా భాగ‌స్వాములుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: