జయసూర్య పై నిషేధం ..!

Prathap Kaluva

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య పై ఐసీసీ నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) విచారణను అడ్డుకోవడంతో పాటు సాక్ష్యాలుగా ఉన్న ఫోన్లను ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో అతనిపై రెండేండ్ల నిషేధం విధించింది. ఈ కాలంలో అతను ఎలాంటి క్రికెట్ కార్యకాలాపాలలో పాల్గొనకూడదని అంతర్జాతీయ బాడీ వెల్లడించింది. రెండు సందర్భాలలో జయసూర్య ఏసీయూ నిబంధనలను ఉల్లంఘించాడని తేల్చిన ఐసీసీ గరిష్టంగా ఐదేండ్ల శిక్ష విధించాల్సి ఉన్నా.. గతంలో అతని క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకుని రెండేండ్లకే పరిమితం చేసింది.


అలాగే పెద్ద మనసుతో గతేడాది అక్టోబర్ 16 నుంచే ఈ నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఏసీయూ విచారణలో భాగంగా అధికారులు.. శ్రీలంక క్రికెట్‌లో నెలకొన్న అవినీతిపై జయసూర్యను పలు దఫాలుగా ప్రశ్నించినా సరైన సమాధానాలు, సాక్ష్యాలు ఇవ్వలేదు. దీంతో ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.4.6 ప్రకారం సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణను అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం వంటి అభియోగాలు అతనిపై నమోదు చేశారు. 


సెప్టెంబర్ 22, 23 తేదీలలో ఏసీయూ విచారణకు హాజరైన జయసూర్యను మొబైల్స్, దానికి సంబంధించిన పలు వివరణలు ఇవ్వాలని కోరినా.. అతను ఇవ్వకుండా తిరస్కరించాడు. రెండోసారి అక్టోబర్ 5వ తేదీని విచారణకు హాజరుకాకుండా తన తరఫు న్యాయవాదిని పంపాడు. ఫోన్‌లో ఉన్న ఓ ప్రైవేట్ వీడియో వైరల్ కావడంతో దానిని ధ్వంసం చేశానని అతను చెప్పడంతో ఏసీయూ తీవ్రంగా పరిగణించింది. కానీ అదే సమయంలో జయసూర్య వందలకొద్ది ఫోన్లు, మెసేజ్‌లు, రికార్డింగ్‌లు చేశాడని ఏసీయూ గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: