అదరగొట్టిన అమ్మాయిలు ... సిరీస్ స్వంతం...!

Prathap Kaluva

స్వంత గడ్డ పై అమ్మాయిలు అదరగొట్టారు. బలమైన ఆతిధ్య జట్టయినా ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి వన్డే సిరీస్ ను స్వంతం చేసుకున్నారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే కప్‌ను కైవసం చేసుకున్నారు. శిఖా పాండే, గోస్వామి పేస్ విజృంభణతో ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో మందన మెరుపులకు తోడు పూనమ్ రౌత్, మిథాలీరాజ్ సమయోచిత బ్యాటింగ్‌తో భారత్ భారీ విజయాన్నందుకుంది.


దీని ద్వారా ఐసీసీ వన్డే చాంపియన్‌షిప్‌లో పైకి ఎగబాకిన టీమ్‌ఇండియా తమ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మరోవైపు వరుసగా రెండు వన్డేల్లో ఓటములతో ఇంగ్లిష్ జట్టు కుదేలైంది. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు సొంతగడ్డపై జూలు విదిల్చింది. బలబలాల పరంగా తమ కంటే మెరుగైన ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తూ వన్డే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..శిఖాపాండే (10-1-18-4), వెటరన్ జులన్ గోస్వామి(4/30) విజృంభణతో 43.3 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది.


నటాలీ స్కీవర్(109 బంతుల్లో 85, 12 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్...41.1 ఓవర్లలో 3 వికెట్లకు 162 పరుగులు చేసింది. ముంబై హార్డ్‌హిట్టర్ స్మృతి మందన (74 బంతుల్లో 63, 7ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ మిథాలీరాజ్ (69 బంతుల్లో 47 నాటౌట్, 8ఫోర్లు), పూనమ్ రౌత్(32) రాణించారు. శ్రుబ్‌సోల్(2/23)కు రెండు వికెట్లు దక్కాయి. నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకమైన గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య ఈనెల 28న జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: