హిట్ కాదు 'ఫట్' మ్యాన్.. రోహిత్ కెరియర్ ముగిసినట్టేనా?

praveen
హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. భార‌త జ‌ట్టులోని కీలకమైన ఆటగాడిలో రోహిత్ శ‌ర్మ ఒక‌డు. తనదైన ఆట‌తీరుతో రోహిత్ ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జ‌ట్టుని ఒంటి చేత్తో గెలిపించిన ఘనత రోహిత్ శ‌ర్మ సొంతం. అతని పేరు వినగానే వ‌న్డేల్లో అత‌ను సాధించిన 3 డ‌బుల్ సెంచ‌రీలు గురించి మాట్లాడుకోవాలి. ఇంకా వ‌న్డేల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన ఆట‌గాడిగా త‌న రికార్డు ఇప్పటికీ ప‌దిలంగా ఉంది.
ఇక అసలు విషయంలోకి వెళితే... రోహిత్ శ‌ర్మ ఫామ్ ప్ర‌స్తుతం భయానకంగా ఉంది. ఆసీస్ వేదికగా వ‌రుస‌గా ఫెయిల్ అవుతున్నాడు. కీల‌క‌మైన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3 ప‌రుగుల‌కే ఔటై అందరికీ షాక్ ఇచ్చాడు. బ్యాట‌ర్ గా, ఫీల్డ‌ర్ గా ఫెయిల్ కావడం వలన ఆటోమెటిగ్గానే కెప్టెన్సీ వీక్ అయిపోతోందని విశ్లేషకులు అంటున్నారు. అవును, రోహిత్ కొన్ని సుల‌భ‌మైన క్యాచ్‌ల‌ను సైతం వదిలేస్తున్నాడు. ఇక అన్నింటికంటే తోటి ఆట‌గాళ్ల‌తో త‌న‌కు స‌యోధ్య కుద‌ర‌డం లేద‌నే మాట బాగా వినిపిస్తోంది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోనికి తీసుకొంటే – అతి త్వ‌ర‌లోనే రోహిత్ గుడ్ బై చెప్పేస్తాడ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.
అవును... సిడ్నీ టెస్ట్ మ్యాచ్ త‌ర‌వాత రోహిత్ శ‌ర్మ టెస్ట్ క్రికెట్ తో పాటు, ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కి గుడ్ బై చెబుతాడ‌న్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 5వ టెస్ట్ మొద‌లు కాక‌ముందే రోహిత్ రిటైర్‌మెంట్ ప్ర‌కట‌న వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టెస్ట్ క్రికెట్ ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతోంది. మైదానం లోప‌ల‌, బ‌య‌టా దూకుడుగా ఉంటూ యువ‌ర‌క్తం జ‌ట్టులో స్థానం సంపాదించ‌డానికి ఉరక‌లేస్తోంది. గిల్‌, జైస్వాల్ లాంటి ప్ర‌తిభావంతులు ఓపెన‌ర్లుగా రాణిస్తున్నారు. అలాంట‌ప్పుడు రోహిత్ ఇంకా జ‌ట్టులో కొన‌సాగ‌డంలో అర్థం లేద‌న్న‌ది కొందరు మాజీలు వాదిస్తున్నారు. మ‌రి హిట్ మాన్ ఏమంటుకుంటున్నాడో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: