శబరిమల వివాదానికి కారణం సికిందరాబాద్ మెట్టుగూడ అయ్యప్ప ఆలయమే!

సుప్రీం కోర్ట్ తీర్పు దరిమిలా చెలరేగిన "కేరళ లోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం" వివాదానికి సికింద్రాబాద్‌ లోని మెట్టుగూడ అయ్యప్ప క్షేత్రంలో ఉన్న వాస్తు దోషమే కారణమా? అనే అనుమానం ఇప్పుడు ఒక సంచలనం. సికిందరాబాద్ నుంచి శబరిమలకు 1200 కి.మీ. దూరం. అయినా ఇంతదూరంలో లో ఉన్న ఒక ఆలయంలో వాస్తు దోషం దేశాన్ని మొత్తం కుదిపేస్తుందా? ఇదీ ప్రధాన ప్రశ్న.

ఇది యదార్ధమని చెపుతున్నారు పూజార్లు. ఇందుకోసం నష్టనివారణ చర్యలు కూడాచేపట్టారు. ఏకంగా శబరిమల ఆలయ ప్రధానపూజారుల్లో ఒకరు భాగ్యనగరానికి వచ్చారు  ఆయనతో కలిపి మొత్తం 9మంది పూజారుల బృందం అయ్యప్ప మెట్టుగూడా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 26) ప్రారంభ మైన ఈ దోష నివారణ పూజలు నిన్న ఆదివారం వరకూ కొనసాగాయి.  


శబరిమల అయ్యప్ప ఆలయానికి సికింద్రాబాద్‌ మెట్టుగూడ అయ్యప్ప ఆలయం అనుసంధాన ఆలయంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో అయ్యప్ప దీక్ష తీసుకోవ డానికి ఏటా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అంతేకాకుండా శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప దీక్షధారులు ఇక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించిన తర్వాతే యాత్రకు బయలు దేరడం ఒక విశేషం  అత్యంత నిబిడీకృతమైన విశ్వాసం. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయంలో వాస్తు దోషం ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారింది. ఇక్కడి అయ్యప్ప ఆలయంలో నైరుతిదిశలో ఉండాల్సిన నాగరాజు, నాగయక్షిణి మూర్తులు వాయవ్యందిశలో ఉన్నాయట. ఈ కారణంగానే జరిగే అరిష్టాలు ప్రభావం శబరిమల అయ్యప్ప క్షెత్రంపై దేశమంతా నెలకొన్న అశాంతికి మూలకారణమని భక్తులు నమ్ముతున్నారు. 


ఈ వాస్తు దోషాన్ని 2012లోనే గుర్తించినా ఆ వాస్తు దోష నివారణ పూజలు నిర్వహించి నాగరాజు, నాగ యక్షిణి మూర్తులను వాయవ్యం దిశ నుంచి నైరుతి దిశకు  మార్చాల ని అనాడే నిర్ణయించారట. కానీ, ఏదో కారణాలతో అది కార్యరూపం దాల్చలేదట. ఈ విషయాన్ని ఆరేళ్ల కిందట సికిందరాబాద్ మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి శబరిమల ఆలయ ప్రధాన పూజారి మేనల్లుడైన కందారు రాజీవరు విచ్చేసిన సందర్భంలో ఈ వాస్తు దోషాన్ని గుర్తించి, వెంటనే సరిచేయాలని సూచించారట. ఈ అంశంపై ఆలయ ప్రధాన కార్యదర్శి వినోద్ నంబియార్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


"వాస్తు దోషం విషయం తెలిశాక కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో అరిష్టాలు జరుగుతున్నాయని భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు నమ్ముతున్నారు. 2012 తర్వాత కమిటీకి అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో అకాల మరణం చెందటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మాజీ ప్రధాన పూజారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో పాటు కాలనీకి చెందిన పలువురు వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు" 48ఏళ్ల నంబియార్‌ కు మెట్టుగూడ ఆలయంతో తన తండ్రి కాలం నుంచే అనుబంధం ఉంది. 
 
ఘోటక బ్రహ్మచారి అయ్యప్ప దేవుని ఆలయం లోకి మహిళలు ప్రవేశించ వచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శబరి మల ఆలయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న మహిళలు, సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న భక్తుల మధ్య ఘర్షణతో కేరళ అట్టుడుకుతోంది. శబరిమల ఆలయం ఉదంతం ఈ స్థాయిలో వివాదాస్పదమవడానికి కారణాలేంటని ఆలయ పూజారులు సమాలోచనలు జరిపుతున్నప్పుడు మెట్టుగూడ ఆలయంలో వాస్తుదోషం దీనికి మూలమన్న భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. 

శబరిమలఆలయ ప్రధానపూజారుల్లో ఒకరు, ప్రధాన పూజారి మేనల్లుడైన పోతి నీలకంఠం హైదరాబాద్ విచ్చేసి మెట్టుగూడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తు న్నారు.  సుమారు ఏడు  లక్షల వ్యయంతో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. ఈ క్రతువు అనంతరం శబరిమల వివాదం సమసి పోతుందని బలంగా నమ్ముతున్నారు.  నిజానికి దేశంలో ఎక్కడ అయ్యప్ప ఆలయాలు నిర్మించాల్సి వచ్చినా, శబరిమల ఆలయ పూజారుల సూచనలు తీసుకుంటారు. 1970 లో మెట్టుగూడ అయ్యప్ప ఆలయాన్ని కూడా ఇదే విధంగా నిర్మించారు. నాటి శబరిమల ఆలయ ప్రధానపూజారి నీలకంఠారు తంత్రి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు. అయితే, నాగమూర్తు ల  విషయంలో ఎక్కడ ఎలా లోపం జరిగిందో తెలియడం లేదని ఆలయ కమిటీ సీనియర్ సభ్యులు బాల మల్లేషు చెబుతున్నారు. ప్రధాన పూజారి నీలకంఠం మాత్రం ఈ విషయంలో మీడియాతో మాట్లాడటానికి సుముఖత చూపలేదట.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: