అక్షయ తృతీయ రోజున ఇవి దానం చేస్తున్నారా ?

VAMSI
అక్షయ తృతీయ మహిళలకు ప్రధానమైందే కాదు ఇష్టమైన పండుగ కూడా, సంస్కృతంలో అక్షయం అంటే నాశనం లేనిది అనంతమైనది అని అర్ధము. ఈ మహా పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఎటువంటి అంతరాయం లేకుండా లాభదాయకంగా కొనసాగుతుందని ఒక విశ్వాసం. అలాగే ఈ పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పవిత్రమైన నాడే త్రేతాయుగం ప్రారంభమైనదని పూర్వీకులు చెప్పేవారు. అలాగే గంగమ్మ తల్లి ఈ భూమిపై ఉద్భవించిన రోజని ప్రతీతి. ఈ పండుగ ప్రతి ఏడు వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజు వస్తుంది. కాగా ఈ ఏడాది మే 14 న వచ్చింది. అక్షయ తృతీయ నాడు ధన దేవత శ్రీ మహాలక్ష్మిని, అలాగే నారాయణుడిని అందరూ ఆరాధిస్తారు . అక్షయ తృతీయ నాడు చేసే పూజ సిరిసంపదలను, సుఖసంతోషాలతో పాటు అపారమైన జ్ఞానాన్ని కూడా అందిస్తుంది.
ప్రత్యేక పూజలతో ఈ పండుగను ఎంతో వేడుకగా ఆనందంగా జరుపుకుంటారు. ఈ  పర్వదినాన ఎవరికి వీలైనంతలో వారు బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. ఇది  ఎప్పటి నుండో వస్తున్న  ఆనవాయితీ.  అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా ఈరోజు గవ్వలను తెచ్చి పూజిస్తే మంచి జరుగుతుందని అంటారు. అలాగే నూతన వస్త్రాలు, పండ్లు ఫలహారాలు..ఇలాంటి వాటిని దానం చేయడం వల్ల కోటి వ్రతాలు చేసిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్పిన మాట. అయితే ఏ రాశి వారు ఏ వస్తువు దానం చేస్తే గొప్ప ఫలితాన్ని, ఆ లక్ష్మి,నారాయణుల అనుగ్రహాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మేష రాసి వారు, ఈ రాశివారు అక్షయ తృతీయ పర్వదినాన ఎర్రటి రంగులో ఉండే వస్తువులను, గోధుమలను దానం చేయుట శ్రేష్టం అని వీటిని దానం చేయడం వలన సుఖ సంపదలు వరిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు.  వృషభ రాశి వారు నేడు నీలి రంగు వస్త్రాలను, గోమాతను, ధాన్యాన్ని ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందగలరు. మిధున రాశి వారు బేదు పచ్చని రంగులో ఉండే బట్టలను , బంగారాన్ని, కూరగాయలను దానం చేస్తే వారికి అంతా  జయమే కలుగుతుంది. కర్కాటక రాశి వారు అక్షయ తృతీయ నాడు తెలుపు రంగులో ఉండే వస్త్రాలను, బియ్యాన్ని,  మధుర పదార్ధాలను ఇవ్వడం ద్వారా వారికి అంతా శుభమే జరుగుతుంది. సింహ రాశి వారు నేడు  ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను, కర్పూరాన్ని, కొవ్వొత్తులను , రాగి వంటి వాటిని దానం చేయడం ద్వారా వారికి భోగభాగ్యాలు అందుతాయి. కన్య రాశి వారు నేడు పచ్చ రంగు వస్త్రాలను, మొక్కలను, విద్యకు సంబంధించిన వాటిని అనగా  పుస్తకాలు, పలకలు, పెన్సిల్స్..వంటి వాటిని దానం ఇవ్వడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయి.
తులా రాశి వారు నేడు నీలి రంగు వస్త్రాలను, పాలతో చేయబడినటువంటి పదార్థాలను దానం చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు నేడు ఎర్రటి దుస్తులను, ఎర్రటి గాజులను దానం చేయడం వలన వారి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ధనుస్సు రాశి వారు నేడు పసుపు రంగు వస్త్రాలను, తీపి పదార్థాలను, అన్న దానం వంటివి చేయడం ద్వారా వారి భవిష్యత్తు వేయి కాంతులతో వెలిగిపోతుంది. మకర రాశి వారు నలుపు వస్త్రాలను, ఇనుముతో చేయబడినటువంటి వస్తువులను, బియ్యాన్ని దానం చేయడం ద్వారా వారి ఇష్ట  కార్యాలు నెరవేరుతాయి. కుంభ రాశి వారు నేడు పసుపు వస్త్రాలను, కొబ్బరి, నవ ధాన్యాలను దానం చేయడం ద్వారా  వారి సంతానం యొక్క విద్య జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా కొనసాగుతుంది. మీన రాశి వారు నేడు బులుగు రంగు వస్త్రాలను, బంగారాన్ని దానం చేయడం ద్వారా వారి జీవితం ఆనందమయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: