హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

Vijaya
తమిళనాడులో తలైవా గా అన్నాతై గా పాపులరైన రజనీకాంత్ వ్యవహారం ఇపుడు రివర్సులో నడుస్తోంది. తనను రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి పెట్టద్దు బాబోయే అంటూ మొత్తుకుంటున్నాడు. చేతులుజోడించి అభిమానసంఘాల నేతలను బతిమలాడుకుంటున్నాడు.  వయస్సయిపోయిన తర్వాత, అనారోగ్యాలు పట్టిపీడిస్తున్న సమయంలో ఏదో పొడిచేస్తానంటూ తొందరలోనే రాజకీయపార్టీ పెడతానని ఓ ప్రకటన చేశారు రజనీ.  అన్నీ బాగుంటే మొన్న డిసెంబర్ 31వ తేదీనే పార్టీ పేరు, పార్టీ విధి విదానాలను ప్రకటించుండాల్సింది. అయితే హైదరాబాద్ లో అన్నాతై సినిమా షూటింగ్ లో ఉండగా యూనిట్లో ఎనిమిదిమందికి కరోనా వైరస్ సోకింది. రజనీకి కూడా కరోనా సోకిందో లేదో తెలీదు. పరీక్షలు చేయించుకున్నాడు, నెగిటివ్ రిజల్టు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. హాస్పిటల్ ప్రకటించింది కాబట్టి మనం నమ్మాలంతే.



విచిత్రమేమిటంటే హైబీపీ కారణంతోనే ఆసుపత్రిలో చేరారని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం ఐదు రోజులు రజనీని ఇన్సెంటివ్ కేర్లోనే ఉంచేసింది. ఎవరినీ కలవనీయలేదు. హైబీపీ కారణంతోనే ఎవరైనా ఆసుపత్రిలో చేరి ఇన్సెంటివ్ కేర్ లో అన్ని రోజులుంటారా ? సరే ఆ తర్వాత డిస్చార్జయి చెన్నైకి వెళ్ళిన తర్వాత రజనీకి కుటుంబసభ్యులు ఫుల్లుగా క్లాసుపీకారట. దాంతో జ్ఞానోదయమై వెంటనే రాజకీయపార్టీ ఏర్పాటు కాదు కదా చిరవకు పొలిటికల్ ఎంట్రీ కూడా లేదు పొమ్మన్నాడు. ఇదిగో అప్పటి నుండి రజనీని అభిమానసంఘాలు గట్టిగా తగులుకున్నాయి. దాదాపు 25 సంవత్సరాలుగా ఇదిగో వచ్చేస్తున్నా..అదిగో వచ్చేస్తున్నా అంటూ అభిమానులను ఊరించిన రజనీకి అభిమానసంఘాలు ఇపుడు ఎదురుతిరిగాయి.



అనారోగ్యం లేదు ఏమీ లేదు రాజకీయాల్లోకి రావాల్సిందే, పార్టీ పెట్టాల్సిందే, పోటీ చేయాల్సిందే అంటూ పదే పదే ఇంటిముందు నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి అభిమాన సంఘాలు. పొద్దున్న లేచింది నుండి రాత్రివరకు ఒకటే హడావుడి. నిజానికి రజనీకి హైబీపీ రావాల్సిందే ఇపుడు అన్నట్లుగా తయారైంది పరిస్దితి. ఒకవైపు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఇంకోవైపు నాలుగు మాసాలుగా అనారోగ్యం. మరోవైపు ఎంతకీ తగ్గనంటున్న హైబీపీ. దీనికి అదనంగా కరోనా వైరస్ మహమ్మారి. ఈ నేపధ్యంలో రాజకీయాల్లోకి ప్రవేశించమని, పార్టీ పెట్టమని ఎన్నికల్లో పోటీ చేయమని రజనీని ఎవరడిగారు ? రాజకీయప్రవేశంపై ప్రకటన చేసేముందు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ? ఏదో ‘దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు’ అని సినేమా డైలాగు చెప్పినట్లనుకున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమంటే. అందుకనే ఇంటిముందు గోల చేస్తున్న అభిమానసంఘాల నేతలను రాజకీయాల్లోకి రాను..రాను తనను ఒత్తిడి చేయద్దు బాబోయే అంటు బతిమలాడుకుంటున్నాడిపుడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: