హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు అనుభవం దేనికైనా పనికొచ్చిందా ?
2014 రాష్ట్ర విభజన నాటికి ఏపి ప్రస్ధానం అప్పులతో మొదలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనకు తగ్గట్లుగా ఏదో నాలుగు శాశ్వత భవనాలు కట్టేసుంటే బాగుండేది. సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజభవన్, హైకోర్టు భవనాలను మామూలుగా నిర్మించేయకుండా ప్రపంచస్ధాయి రాజధానని, ఢిల్లీనీ తలదన్నే రాజధాని నగరం అంటూ ఒకటే సోది చెప్పారు. ప్రపంచదేశాల్లోని అత్యుత్తమ రాజధాని నగరాల అధ్యయనం పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశారు. పెద్ద బృందాన్ని తీసుకుని చంద్రబాబు 18 దేశాల్లో తిరగటమే కాకుండా తర్వాత కూడా తనకిష్టమైన ఉన్నతాధికారుల బృందాలను కూడా విదేశాలకు పంపారు. అంటే ఏ స్ధాయిలో చంద్రబాబు రాజధాని ముసుగులో వందల కోట్ల రూపాయలు వృధా చేశాడో అర్ధమైపోతోంది. ప్రపంచస్ధాయి ఆర్కెటెక్ట్ ఎంపిక పేరుతో మరో వంద కోట్లను దుబారా చేశాడు. చివరకు బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ అనే ఆర్కిటెక్టు గిసిన డిజైన్లకు సుమారు రూ. 200 కోట్లు చెల్లించాడు. దాన్ని జనాభిప్రాయానికి పెడితే తిరస్కరించారు.
ఇలా ఎక్కడికక్కడ వందల కోట్లను వృధా చేయటంలోనే చంద్రబాబు అనుభవం కనబడింది. చివరకు రాజధాని ప్రాంతంలో ఏమీ చేయకుండానే అధికారంలో నుండి దిగిపోయిన ఫలితంగా ఇపుడు రాజధాని వివాదం తారస్ధాయికి చేరుకుంది. సరే ఈ విషయాన్ని వదిలేస్తే పోలవరం ప్రాజెక్టయినా కట్టాడా అంటే అదీ లేదు. ప్రతిరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు, సైటు టూర్ల పేర్లతో హంగు ఆర్భాటాలు తప్ప ఇంకేమీ లేదు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాల్సుంటే బలవంతంగా చంద్రబాబు దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇపుడది కూడా కంపైకూర్చుంది. 2014 అంచనాల ప్రకారమే నిధులిస్తామని తాజాగా కేంద్రం మెలికపెట్టింది. అదేమంటే 2017లో కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు అంగీకరించాడంటూ అప్పటి రికార్డును చూపిస్తోంది పోలవరం ప్రాజెక్టు అథారిటి(పీపీఏ). నిజానికి ప్రాజెక్టు పూర్తవ్వాలంటే అవసరమైన నిధులు సుమారు రూ. 50 వేల కోట్లు. కానీ 2014 అంచనాల ప్రకారం చంద్రబాబు అంగీకరించిన మొత్తం రూ. 20,398 కోట్లకే.