మంత్రి పదవుల ముసురు చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ!
ఇక ప్రభుత్వం త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోనుండటంతో… మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ… కీలక నాయకులు మంత్రి వర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. “ఈసారి కచ్చితంగా ఛాన్స్ వస్తుంది” అన్న నమ్మకంతో కొందరు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? లేక ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? అన్న ప్రశ్నలు పార్టీలో హాట్ డిస్కషన్‌గా మారాయి. అయితే మరోవైపు చంద్రబాబు మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు స్పష్టంగా దృష్టి పెట్టలేదన్నది పార్టీ వర్గాల మాట. అసలు మంత్రివర్గ ప్రక్షాళన ఉండకపోవచ్చన్న భావన కూడా లోపల వినిపిస్తోంది. గతంలో 2014–19 పాలనలో చంద్రబాబు కేవలం ఒక్కసారి మాత్రమే చిన్నపాటి మార్పులు చేశారు. ఒకరిద్దరు మంత్రులను తప్పించి, మిగిలిన వారిని యధాతధంగా కొనసాగించారు. అదే సమయంలో వైసీపీ హయాంలో మాత్రం పూర్తి భిన్నంగా… మొత్తం మంత్రివర్గాన్నే ప్రక్షాళన చేశారు.
ఇప్పుడు అదే ఫార్ములా కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందన్న ప్రచారం జరిగినా… దానికి పెద్దగా అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కారణం స్పష్టం. మొత్తం మంత్రివర్గాన్ని మార్చేస్తే శాఖలపై పట్టు కోల్పోవడం, కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఆగిపోవడం, పాలనలో గందరగోళం ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే రిస్క్ తీసుకునే అవకాశమే లేదని సమాచారం. ప్రస్తుతం ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీనితో పాటు మరో రెండు లేదా మూడు సీట్లు మాత్రమే మార్చి… కొత్తవారికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండొచ్చన్నది పార్టీలో వినిపిస్తున్న మాట. అంటే భారీ ప్రక్షాళన కాదు… సింబాలిక్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే అన్నమాట. మొత్తానికి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఇది నిరీక్షణ పరీక్షగా మారింది. చంద్రబాబు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆశావహుల్లో ఎవరి కల నెరవేరుతుంది? ఎవరి ఆశలు ఆవిరవుతాయి? అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం నిజం… మంత్రి పదవి మాట వచ్చిందంటే టీడీపీలో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతోంది!