'బిజినెస్ టుడే' గెలుపు: నారా బ్రాహ్మణి 'మాస్' నాయకత్వం!

Amruth kumar
బిజినెస్ రంగంలో మరోసారి తెలుగు మహిళ సత్తా చాటింది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్టాత్మక ‘బిజినెస్ టుడే మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ 2025’ అవార్డును గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇండియాలో భారీ వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్న మహిళలకు ఇచ్చే ఈ అవార్డు దక్కడం నిజంగా గొప్ప గౌరవం. నాయకత్వం అంటే కేవలం పదవులు కాదు… దీర్ఘకాలిక సంస్థలు నిర్మించడం, విలువలు సృష్టించడం అని బ్రాహ్మణి వ్యాఖ్యానించడం ఆమె స్టైల్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో బ్రాహ్మణిపై ప్రశంసల వర్షం కురిసింది. ముఖ్యంగా ఆమె నాయకత్వ శైలి గురించి రాజకీయ, వ్యాపార వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.

“నాయకత్వం అంటే హడావుడి కాదు… నిశ్శబ్దంగా నిర్మించడం, దీర్ఘకాలిక ఆలోచనతో చేతల్లో ఫలితాలు చూపించడం” అంటూ నారా లోకేష్ చేసిన ప్రశంసలు వైరల్ అయ్యాయి. అదే విధంగా, బిజినెస్ టుడే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ జాబితాలో బ్రాహ్మణి పేరు కనిపించడం గర్వకారణమని నారా భువనేశ్వరి అభినందించారు. 2011 నుంచి హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చేపట్టిన బ్రాహ్మణి నారా… సంస్థను పూర్తిగా కొత్త దిశలో నడిపించారు. అప్పట్లో సుమారు రూ. 1,000 కోట్ల రెవిన్యూ ఉన్న హెరిటేజ్… 2025 నాటికి ఏకంగా రూ. 4,134 కోట్లకు చేరడం ఆమె నాయకత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. కేవలం వృద్ధి మాత్రమే కాదు… క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ విస్తరణ అన్నింటిలోనూ హెరిటేజ్ కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. బ్రాహ్మణి నేతృత్వంలో హెరిటేజ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మార్కెట్ వాటా 40 శాతానికి పెరగడం మరో కీలక విజయంగా చెప్పుకోవచ్చు.

పాలు మాత్రమే కాదు… ఇప్పుడు కర్డ్, పనీర్, ఐస్‌క్రీమ్, మిల్క్ డ్రింక్స్ వంటి ఉత్పత్తులు కూడా మార్కెట్లో మంచి పట్టు సాధించాయి. దక్షిణ భారతంలో బలమైన స్థానం ఉన్న హెరిటేజ్‌ను మహారాష్ట్ర, ఈస్టర్న్ రీజియన్ వరకు విస్తరించడం కూడా ఆమె వ్యూహాత్మక ఆలోచన ఫలితం. ముఖ్యంగా బ్రాహ్మణి నాయకత్వంలో హెరిటేజ్… ఒక ట్రెడిషనల్ డైరీ కంపెనీ నుంచి మాడర్న్ FMCG బ్రాండ్‌గా మారింది. సస్టైనబుల్ గ్రోత్, ఇన్నోవేషన్, కస్టమర్ ట్రస్ట్ అనే మూడు స్తంభాలపై సంస్థను నిలబెట్టడమే ఆమె అసలైన విజయం. అందుకే ఈ అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు… తెలుగు వ్యాపార శక్తికి, మహిళా నాయకత్వానికి దక్కిన గ్లోబల్ రికగ్నిషన్ అని చెప్పొచ్చు. మొత్తానికి… బిజినెస్ టుడే అవార్డుతో బ్రాహ్మణి నారా పేరు మరింత బలంగా మారింది. నిశ్శబ్దంగా పనిచేస్తూ, ఫలితాలతో మాట్లాడే ఈ నాయకత్వం… రాబోయే రోజుల్లో మరిన్ని విజయాల బాటలు వేస్తుందన్నది ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: