తాడేపల్లికి రారా? వైసీపీ నేతలకు అంతుచిక్కని 'ఆర్థిక' రహస్యం!

Amruth kumar
మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు వైసీపీ వర్గాలతో సహా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ప్రెస్‌మీట్ అజెండా ఏంటంటే... ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడం! ముఖ్యంగా, ఇటీవల ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల మీద అప్పులు తెచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో వైసీపీ అప్పులు తేవాలని చూసినప్పుడు 'అప్పు కిక్కు' అంటూ ఆడిపోసుకున్న టీడీపీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించడానికి ఆయన రంగంలోకి దిగారు. అయితే, బుగ్గన లేవనెత్తిన పాయింట్‌లోనే బలహీనత ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో వైసీపీ ప్రభుత్వం మధ్యనిషేధం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. దాని పర్యవసానంగానే, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై అప్పులు తేవాలనుకున్నప్పుడు ప్రజలు, విపక్షాలు ప్రశ్నించారు. ఈ మధ్యనిషేధం హామీని బుగ్గన పూర్తిగా మరచిపోయి, కేవలం అప్పుల అంశాన్నే హైలైట్ చేయడం ఆయన లాజిక్‌కు విరుద్ధంగా ఉందనే సైటైర్లు వినిపిస్తున్నాయి.అయినా, అసలు రచ్చంతా వేరే ఉంది. సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్‌లోనే ప్రెస్‌మీట్ ఎందుకు పెడుతున్నారో సొంత పార్టీ నేతలకే అర్థంకావడం లేదు. టీడీపీపై విమర్శలు చేయాలంటే, శ్యామల వంటి నాయకురాళ్ళు కూడా విజయవాడ వచ్చి, పార్టీ ఆఫీసు నుంచే మాట్లాడతారు. ఎందుకంటే, పార్టీ ఆఫీసులో పెడితేనే చేసే విమర్శలకు కాస్త వేయిటేజీ వస్తుంది.

కానీ, బుగ్గన మాత్రం హైదరాబాద్ నుంచి తాడేపల్లికి రావడం సమయం వృధా అనుకుంటున్నారు. సజ్జల ఆఫీసు నుంచి వచ్చే మెటీరియల్‌ను... హైదరాబాద్‌లోనే ప్రింట్లు తీసుకుని, అక్కడి నుంచే మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. "ఆయన వైసీపీ ఆఫీసుకు రానని ఒట్టేసుకున్నారా?" అన్న సైటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.బుగ్గన లాజికల్‌గా మాట్లాడతారు, సీనియర్ నేతగా మంచి పట్టు ఉంది. అయితే, ఆయన ఎక్కడ జగన్‌ను డామినేట్ చేస్తారోనని పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వరనే వాదన వైసీపీలో బలంగా ఉంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆర్థిక అంశాలపై మాట్లాడే ఛాన్స్ దక్కుతుంది. ఆ అవకాశాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే పూర్తి చేయడం... తాడేపల్లిలో ఆయనకు దక్కిన 'అంతరంగ' ప్రాధాన్యతను తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ హైదరాబాద్ సెంటిమెంట్ రగడపై బుగ్గన స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: