తెలంగాణ టికెట్ రేట్ల రగడ: 'సంక్రాంతి' పోరుకు ముందే నిర్మాతలకు షాక్!

Amruth kumar
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారం, స్పెషల్ షోల అనుమతులు గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఏడాది ‘పుష్ప 2: ది రూల్’ మూవీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, ప్రభుత్వం అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేసింది: ఇకపై టికెట్ రేట్ల పెంపుకు, స్పెషల్ షోలకు అనుమతులు ఉండవు! అయితే, ఈ ప్రకటన తర్వాత కొన్ని సినిమాలకు అవకాశం ఇవ్వడం, మళ్ళీ దసరాకు వచ్చిన ‘ఓజీ’ విషయంలో ప్రీమియర్స్, రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసినా, హైకోర్టు కొన్ని గంటల ముందే దానిని రద్దు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత, ఇటీవల 'అఖండ 2: తాండవం' విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.

ఈ అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ పరిశ్రమకు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు! "ఇకపై ఎవరూ తమ వద్దకు రేట్లు పెంచమని రావొద్దని, తమకు రిక్వెస్ట్ చేయొద్దని.. ఎలాంటి అనుమతులు ఇవ్వమని" ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో, సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల నిర్మాతలకు లక్షల్లో నష్టం తప్పదా అనే ఆందోళన మొదలైంది. పుష్ప ఘటన తర్వాత కొన్ని సినిమాలకు మినహాయింపులు ఇచ్చినా, రీసెంట్‌గా మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన ఈ 'అల్టిమేటం' సంక్రాంతి చిత్రాల నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ, పొంగల్‌కు రానున్న కొన్ని మూవీల నిర్మాతలు మాత్రం... రేట్ల పెంపునకు ప్రభుత్వం ఛాన్స్ ఇస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ... తమ సినిమాకు మూడు రోజులకే రేట్లు పెంచుతామని, అది కూడా రూ.50-70 మేర తక్కువేనని, ఈ విషయంలో సర్కార్ జీవో జారీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ది రాజా సాబ్’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం... టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు సర్కార్ చెప్పేదాని బట్టి ప్లాన్ చేస్తామని అన్నారు. మంత్రి ఒకవైపు 'నో ఛాన్స్' అని తేల్చి చెప్పగా, నిర్మాతలు మాత్రం మరోవైపు 'ప్లీజ్ కన్సిడర్' అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సంక్రాంతి మాస్ జాతర కోసం వచ్చే చిత్రాల టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ టెన్షన్ ఎప్పుడు తగ్గుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: