మంచిమాట : ఉన్నదానితోనే సంతృప్తి పడేవాడే అదృష్టవంతుడు..

Divya

అనగనగా పూర్వకాలంలో ఒక మహారాజు ఉండేవారు. ఆయన ప్రతిరోజు క్రమం తప్పకుండా  నగర సంచారం చేస్తూ, ప్రజల యోగక్షేమాలను పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతో, విచారంతో కనిపిస్తూ ఉండేవారు. కానీ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించేవారు కాదు. ఇక ఆ రాజు ఆలోచించసాగాడు. వీళ్ళని సంతోష వంతులుగా చేయడం ఎలా? నా రాజ్యంలో ఏ ఒక్కడు సంతుష్టిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండేవాడు లేడా? అని ఆ రాజు ఎంతగానో బాధపడుతూ.. ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు..
ఒక రోజు ఎప్పటిలాగే రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒక చోట రాజుగారికి ఒక ముసలాయన కనిపించాడు. అతడు పొలంలో గోతులు తవ్వుతూ, మొక్కలు నాటుతూ కనిపించాడు. ఒక ముసలాయన ఎంతో శ్రద్ధతో, ఓపికతో ఆ మొక్కలు నాటుతున్నాడు. అతన్ని చూసిన రాజుగారికి చాలా ఆనందం వేసింది. ఇక అతని దగ్గరకు వెళ్లి తాత ఏమిటి నాటుతున్నావు? అని అడిగాడు. రాజు గారి ప్రశ్నకు సమాధానంగా.. ఆ ముసలాయన అయ్యా ! నేను మామిడి మొక్కలు పాతుతున్నాను అని చెప్పాడు.
ఇక రాజుగారు అవి చెట్లై, ఎన్నేళ్ళకు కాయలు కాస్తాయి? అని అడిగాడు. ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడతాయని ముసలాయన సమాధానం చెప్పాడు.
ఇక రాజుగారు మరొకసారి తాత నీ వయసు ముదిరి పోయింది కదా !  ఈ కాయలు తినడానికి మరో ఐదు సంవత్సరాలు నీవు జీవిస్తావా ? అని అడిగాడు.
మహారాజా ! ఇవి నా కోసం కాదు.. నా మనవళ్ళ కోసం.. మా తాతలు పూర్వం ఇలా చెట్లు నాటబట్టే నేను ఇప్పుడు పండ్లు తింటున్నాను. ఇప్పుడు నేను కూడా చెట్లు నాటితే నా మనవళ్లు ఈ పండ్లు తింటారు. అని అన్నాడు.
ఇక ఈ మాట విన్న మహారాజు ఎంతో సంతృప్తి చెంది, నా రాజ్యంలో ఒక్కరైనా సంతుష్టిగా, సంతోషంగా జీవించగలుగుతున్నారు అని ఆనందపడ్డాడు. ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోయి, ఆ ముసలాయనకు అనేక విలువైన బహుమతులను పంపించాడు మహారాజు.. కాబట్టి అందుకే అంటారు ఉన్నదానితో సర్దుకుపోయే వాడు ఎప్పటికైనా అదృష్టవంతుడు అని..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: