ప్రత్యేక హోదాతో... 5 లక్షల కోట్లు..!?

Chakravarthi Kalyan
ఏపీకి ప్రత్యేక హోదా రాదని కేంద్రం దాదాపుగా తేల్చి చెప్పిన నేపథ్యంలో.. ఆ హోదా సాధన కోసం ఏపీలో రాజకీయ శక్తులు ప్రయత్నాలు సాగిస్త్తున్నాయి. విడివిడిగా కాకుండా.. హోదా విషయంలో ఐక్యంగా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు.. 


ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో.. హామీని సాధించేందుకు రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. టెక్నికల్ అంశాలను సాకుగా చూపుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ముఖం చాటేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఉద్యమిస్తేనే హోదా.. 


ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. టీడీపీతో కొనసాగాలా.. జగన్ తో వెళ్లాలా అని బీజేపీ ఆలోచిస్తోందని.. అందుకే హోదా విషయంలో జాప్యం చేస్తోందని ఆయన అన్నారు. హోదా కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. 

కేంద్రాన్ని అడక్కుంటే ప్రత్యేక హోదా రాదని, ఉద్యమం ద్వారానే సాధించగలమని సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై సాగదీస్తున్న కేంద్రం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి నిధులు, 15వేల కోట్ల లోటు బడ్జెట్ ను భర్తీ చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ -టీడీపీ నేతల వైఖరే కారణమని సమవేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు నేతలు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: