బీజేపీకి ఎదురుదెబ్బ.. మిత్రపక్షాలకూ ఆనందాన్నిస్తోంది!

Padmaja Reddy

ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగిలిన ఎదురుదెబ్బ దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు ఆనందాన్ని ఇస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఢిల్లీ ఫలితాల గురించి స్పందించిన నేతలంతా... ఒక విధమైన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఢిల్లీలో భాజపాకు ఎదురైన చేదు అనుభవం గురించి కమలనాథులు ఎవరూ మాట్లాడలేదు కానీ.. మిగతా పార్టీ నేతలు మాత్రం చాలా ఆనందంగా స్పందించారు.

ఇలా స్పందించిన వారిలో ఎన్డీయేలోని పార్టీ నేతలు కూడా ఉండటం విశేషం. భారతీయ జనతా పార్టీ కి తగిన ఎదురుదెబ్బ పట్ల శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆనందం వెలిబుచ్చారు. ఇది భారతీయజనతా పార్టీ అహంకారానికి తగిన గుణఫాఠంఅని అయన అన్నాడు. దేశవ్యాప్తంగామోడీ గాలి ఉందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకొంటున్నారు కానీ.. గాలి కన్నా సునామీ గొప్పదని ఢిల్లీలో రుజువు అయ్యిందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.

ఇక మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి వాళ్లు అయితే.. ఇప్పుడు పండగ చేసుకొంటున్నారు. బీజేపీకి ఎదురైన చావు దెబ్బ వీళ్లను అమితంగా ఆనందపెడుతోంది. ఎన్నికల ముందే మమతా బెనర్జీ ఆప్ కు మద్దతు ప్రకటించింది. ఢిల్లీలోని బెంగాళీలు ఆప్ కు అండగా నిలవాలని కోరింది. తీరా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కుదేలయ్యే సరికి ఆమె మరింత ఆనందపడుతోంది.

సమాజ్ వాదీ పార్టీ అయితే బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ అనుసరిస్తున్న మతతత్వ విధానాలే ఈ ఓటమికి కారణమని అఖిలేష్ యాదవ్ విశ్లేషించాడు. మోడీ పనితీరు పట్ల జనాల్లో ఉన్న అసంతృప్తికి ఇవే నిదర్శనాలు అని నితీశ్ కుమార్ అంటున్నారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్ష నేతలందరికీ ఇదొక ఆనందకరమైన సందర్భమే అవుతోంది. బీజేపీ ఓటమిని వారు బాగానే సెలబ్రేట్ చేసుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: