ఎడిటోరియల్: పవన్ కల్యాణ్ ని నమ్మేదెలా? మళ్ళీ ప్రశ్నిస్తానంటున్నాడు? ఎవరిని?

పవన్ కల్యాణ్ మాటలు కోటలు దాటతాయి. చేతల్లో కావలసినంత నిష్క్రియాపరత్వం. ఎప్పుడేం చేస్తాడో? బహుశ ఆయన్ని పుట్టించిన దైవానికి కూడా అర్ధంకాదు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యాధినేతగా చేసింది, సాధించింది శూన్యం. 2014 ఎన్నిక లకు ముందు టిడిపి-బీజేపి సంకీర్ణానికి మద్దతునిచ్చి ప్రజలకు వారు చేసిన వాగ్ధానాలను నెరవేర్చనివేళ వాళ్ళని కార్యన్ముఖు లను చేసే విధంగా ప్రశ్నిస్తానని కోతలరాయుడులా కోసిన కోతలు అన్నీ ఇన్ని కావు.

అప్పుడు అధికారంలో ఉన్నవారిని పల్లెత్తుమాటగా నైనా ప్రశ్నించని పవన్ కల్యాణ్ శాసనసభలో తమ సభ్యులు అమ్ముడు పోగా జనంలోకి వెళ్ళి వాళ్ళను చైతన్యవంతు లను చేసిన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని అక్కడి ప్రజలకు ఉన్నంత ఆకాంక్ష, కోపం, ఆక్రోశం, ఆగ్రహం “ప్రత్యేక హోదా” విషయంలో ఆంధ్రా ప్రజలకు ఉందా? లేదా? అని ఒక్కోసారి తనకు సందేహం కలుగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల నుంచి రావాల్సినంత నిరసన రానప్పుడు ఎంత బలమైన పోరాటం చేసినా ఉద్యమం చేసినా ఉపయోగం లేదన్నారు.

ఐదేళ్ళు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా రాదని ప్రజలకు అర్ధమైనా ఇంకా పవన్ కల్యాణ్ కు అర్ధం కాకపోవటం ఆశ్చర్యకరం. వైసీపీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తే స్వాగతిస్తామని అన్నారు. ఒకవేళ తప్పుచేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని ఓడిపోయామని వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని ప్రశ్నిస్తారని జనం వారినివారే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. గత చరిత్ర పరిశీలిస్తే ఈయన ప్రశ్నించవలసింది ప్రతిపక్ష టిడిపిని దాని నాయకత్వాన్ని. 


హైదరాబాద్‌ సచివాలయంలో ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడు తుందని అన్నారు. ఇదే ప్రశ్న నాడు టిడిపి ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలేసి అమరావతికి తరలిపోయిన  రోజున నాటి టిడిపి నాయకత్వాన్ని ప్రశ్నించలేదేమిటి? ఎవరిని ప్రశ్నించాలో తెలియని పవన్ కల్యాణ్ ప్రస్తుతం మౌనం వహిస్తేనే మంచిది.  


రాబోయే నెల రోజుల్లో జనసేన రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించబోతున్నామని చెప్పారు. తద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

“నాకున్న ఇమేజ్‌కి లక్షల మంది నన్ను నేరుగా కలవాలని అనుకుంటారు. ప్రతీ ఒక్కరిని కలవడానికి నాకు వీలు కాదు. కాబట్టి రాష్ట్ర కమిటీల ఏర్పాటు ద్వారా వారి సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పని తీరుపై ఏడాది పాటు వేచి చూశాం. ఇప్పుడు కూడా వైసీపీ పనితీరుపై కొంత సమయం తీసుకుని మాట్లాడుతాం. ఒకవేళ ప్రజలను ఇబ్బందిపెట్టే పరిస్థితులు ఏర్పడితే ఏ స్థాయి పోరాటానికైనా వెనుకాడం” అన్న పవన్ కల్యాణ్ వేచి చూసిందేమిటి శూన్యం.  ప్రజలను కలవాలని సమస్యలు అర్ధం చేసుకొని సేవ చేయాలని నిజంగా ఉంటే పవన్ కల్యాణ్ పాదయాత్ర చేయటం మంచిది. 


ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయని ఆ విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉండబోతు న్నాయో? వేచి చూస్తామని పవన్ కల్యణ్ అన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చించి ఎలాంటి పోరాటాలు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. 


జనసేన ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతోముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై స్పందించి న పవన్ కల్యణ్, మిగతా అక్రమ భవనాల విషయంలోనూ అలాంటి చర్యలే తీసుకుని చూపించాలని అన్నారు.


అక్రమ కట్టడం ప్రభుత్వానిది కాబట్టి కూల్చివేయటం న్యాయమే. అయితే వ్యక్తుల అక్రమకట్టడాల కూల్చివేత మొద లెట్టడం అంటే కందిరీగల తుట్టెను  కదిలించటమే. అందుకే వ్యక్తులకు కార్పోరేట్లకు “అపరాధ రుసుము అతి భారంగా వేయాలి" తద్వారా వారికి ఆర్ధిక నష్టం విలువతెలిసేలా చేస్తే ఇటు ప్రభుత్వానికి ఆదాయం మార్గదర్శకాలకు తూట్లు పొడిచిన నేఱానికి ప్రతిగా అపరాధ రుసుం చెల్లించటం ఎంతభారమో వారికి అర్ధం కావటం ఒకేసారి జరిగిపోతాయి. రెండో సారి అక్రమకట్టడం చేపట్టిన వ్యక్తులపట్ల అతి కఠినంగా అంటే నిరాణాల కూల్చివేత అపరాధ రుసుం ఒకేసారి వేయాలి" అదీ పాలన అంటే. 

ఇవి మన పవన్ కల్యాణ్ కు అర్ధమౌతాయో? లేదో? అసలు ఆయనకు ఆయనే అర్ధం ఔతున్నాడో? లేదో? ఆ దైవానికే వదిలెయ్య టం అవసరం. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన ఒక సంవత్సరమైనా గమనించాలి తప్ప చేసేదేముంది. వైఎస్ జగన్ పాలన్లో సంక్షేమ పదకాలకే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తుంది తప్ప అభివృద్ది బహుశ ఉండకపోవచ్చు. అభివృద్ది కావాలంటే గత ప్రభుత్వ ఆర్ధిక నేరాలను తవ్వి తీస్తేనైనా కొంత ప్రయోజనం ఉండవచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: