వైఎస్ఆర్ దయవల్లనే ఆయనకు పెన్షన్ వచ్చే ఉద్యోగం వచ్చింది: ఉండవల్లి జ్యోతి అరుణ కుమార్

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రతి వ్యక్తి తనకున్న పరిచయాన్ని అనుబంధాన్ని పంచుకోవటంలో తృప్తి పొందుతూ ఉంటారు. కారణం ఆయన్ని కలిస్తే చాలు ఎంతోకొంత సహకారంతో కూడిన ఆదరణ లభిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. అది ఆయన సహజ గుణమని అందరూ పంచుకుంటారు. అలాగే రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్ సతీమణి జ్యోతి గారు కూడా వై ఎస్ ఆర్ తన తల్లి జీవితాశయాన్ని నెరవేర్చారన్నారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సతీమణి జ్యోతి. వైఎస్‌ను తాము తలుచుకోని రోజు ఉండదని చెప్పారు. హైదరాబాద్ దసపల్లా హోటల్లో మంగళవారం జరిగిన 'వైఎస్‌ఆర్‌తో ఉండవల్లి..' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జ్యోతి మాట్లాడారు. ఉండవల్లి అరుణ కుమార్ రచించిన పుస్తకం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


అప్పట్లో ఉండవల్లి అరుణ కుమార్‌తో వివాహానికి సిద్దమైనప్పుడు, తమ ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారని జ్యోతి అన్నారు. తాడూ బొంగరం లేనివాడిని ఎలా పెళ్లి చేసుకుంటావన్నారని గుర్తుచేసుకున్నారు. ఏదైనా పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉంటే బాగుండేదని, అలాంటి ఉద్యోగం ఉన్న భర్త వస్తే జీవితం బాగుంటుందని తనతల్లి ఎప్పుడూ చెప్పేవారన్నారు. అదే సమయంలో ఉండవల్లి అరుణ కుమార్ పలు బ్యాంకు జాబ్స్ కోసం పరీక్షలు రాయగా, ఎందులోనూ జాబ్ రాలేదన్నారు.

చివరకు ఇక తనకు రాజకీయం తప్ప మరొకటి తెలియదని ఓకరోజు తమ అమ్మతో చెప్పారని అన్నారు. ఇక అప్పటినుంచి ఆమె కూడా పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారని, ఆయన ప్రతిభను వైఎస్‌ఆర్ గుర్తించి ప్రోత్సహించారని చెప్పారు. ఈరోజు తన భర్త ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ అని చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తన భర్తను ఎంపీ చేశారని, దీంతో ఇప్పుడాయనకు 'పెన్షన్' వస్తుందని అన్నారు. అలా మొత్తం మీద తన తల్లి తమ గురించి ఏదైతే కోరుకుందో, వైఎస్ఆర్ దాన్ని నెరవేర్చారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: