ఎడిటోరియల్ : ఇష్టంలేని రాజకీయం..ఏం చేస్తారో ఏమో ?

Vijaya

రాజకీయాల్లో పరిణామాలు అన్నీసార్లు మనకు ఇష్టం వచ్చినట్లే జరగవు. ఒక్కోసారి మనకు ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ఇప్పుడీ విషయం ఎందుకంటే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో అదే జరుగుతోంది కాబట్టి. పార్టీలో ఇద్దరూ సీనియర్ నేతలే అయినా వారికి ఇష్టంలేని రాజకీయాలు చేయాల్సొస్తోంది. పై ఇద్దరు నేతలు కూడా రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగానే పోటీ చేయాలని గట్టిగా అనుకుంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం వాళ్ళని ఎంపిలుగా పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. ఇపుడిదే ఇద్దరికీ పెద్ద సమస్యగా మారింది.

 

ఒకపుడు గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఎంఎల్ఏగా గెలిచి, ఓడిన అనుభవం కోడెలకు బాగానే ఉంది. రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కారణంగా నరసరావుపేట నుండి కాకుండా సత్తెనపల్లి నుండి పోటీ చేశారు. ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు. రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట నుండి తాను, సత్తెనపల్లి నుండి తన కొడుకు శివరామకృష్ణ పోటీ చేయాలని కోడెల పట్టుబడుతున్నారు.

 

అయితే, చంద్రబాబు అందుకు పూర్తిగా వ్యతరేకిస్తున్నారు. నరసరావుపేట ఎంపిగా కోడెలను పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి పెడుతున్నారు. సత్తెనపల్లి నుండి నరసరావుపేట సిట్టింగ్ ఎంపి రాయపాటి సాంబశివరావు కొడుకు రంగబాబును రంగంలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఆలోచనను కోడెల పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఇక, గంటా విషయం చూస్తే ప్రస్తుతం భీమిలీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో లోకేష్ ను ఇక్కడి నుండి పోటీ చేయించే ఉద్దేశ్యంతో గంటాను తప్పించారు. పైగా విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయమని ఆదేశించారు. భీమిలీని వదులుకోలేక విశాఖ ఎంపిగా పోటీ చేయలేక గంటా అవస్తలు పడుతున్నారు.

 

ఒంగోలు నుండి ఎంపిగా పోటీ చేయటం మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఒత్తిడి పెడుతున్నారు. అందుకనే ఏకంగా పార్టీకే మాగుంట రాజీనామా చేసేస్తున్నారు.  ఇటువంటి నేతలు పార్టీలో ఇంకా చాలామందే ఉన్నారని సమాచారం. నామినేషన్ల వేసేందుకు గడువు కూడా ఎక్కువ లేదు. కాబట్టి టిడిపిలో గోడదూకుడుకు ఎక్కువ మంది రెడీ అవుతున్నారని సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: