బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో ప్రీతి జింటా ఒకరు. ఈమె తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ప్రేమంటే ఇదేరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాతో ప్రీతి కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన రాజ కుమారుడు అనే మరో తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగింది. ఈమెకు ఆ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ ఈమె మాత్రం హిందీ సినిమాల్లో నటించాలి అనే ఉద్దేశంతో తెలుగులో ఎక్కువ సినిమాల్లో చేయలేదు.
ప్రస్తుతం ఈమె హిందీ సినిమాల్లో నటిస్తూ ఐపీఎల్ లో కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు ఓనర్ గా వ్యవహరిస్తుంది. ఇలా ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓ అభిమాని మీరు రాబోయే కాలంలో తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఏమైనా ఉంది అని ప్రశ్నించాడు. దానికి ప్రీతి స్పందిస్తూ ... ఖచ్చితంగా నటిస్తాను. నేను తెలుగు సినిమాల్లో నటించను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ దొరుకుతే కచ్చితంగా తెలుగు సినిమాల్లో నటించడానికి నేను రెడీ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.