ఎడిటోరియల్ : ఎన్నికల వేళ మారణ హేల..! బాధ్యులెవరు?

Vasishta

జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచం మొత్తాన్ని తలదించుకునేలా చేసింది. ఉగ్రవాదంపై పోరు, ఉగ్రవాదంపై వార్ .. లాంటి ఎన్నో ప్రగల్భాలు చాలాకాలం నుంచే పలుకుతున్నా ఇప్పటికీ దానికి మానవాళి తలదించక తప్పని పరిస్థితే ఎదురవుతోంది. తాజా ఘటన దేశం మొత్తాన్ని కలచివేస్తోంది. మరి ఈ దాడికి కారకులెవరు? దీనికి బాధ్యత వహించేదెవరు.? దీనికి అంతమెప్పుడు?


జమ్ము కశ్మీర్ దేశంలో అత్యంత సుందరమైన రాష్ట్రం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది యాత్రికులు నిత్యం వస్తుంటారు. అయితే అక్కడి ప్రకృతి సౌందర్యంపై పగబట్టిన కొన్ని అల్లరి మూకలు నిత్యం అలజడి సృష్టించేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే అక్కడ నిత్య మారణహోమం జరుగుతోంది. బాహ్య ప్రపంచానికి కనిపించేది, చూపించేది కొంతే.! అయితే కనిపించని బీభత్సాలు, మారణకాండలు మరెన్నో.!


జమ్ముకశ్మీర్ లో అశాంతి ఇప్పటిది కాదు. స్వాతంత్రం వచ్చిన సమయంలో మొదలైన ఈ రావణకాండ ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇందుకు కొన్ని స్వార్థపూరిత రాజకీయ పార్టీల వైఖరి ఓ కారణమైతే, అక్కడి ప్రజల మనోభావాలను గెలుచుకోలేకపోవడం, వారిలో దేశం పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పడంలో విఫలం కావడం మరో కారణం. ప్రజల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా విజయం సాధించదనడానికి జమ్ముకశ్మీరే అతి పెద్ద ఉదాహరణ. జమ్ము కశ్మీర్ ప్రజల్లో విభిన్న అభిప్రాయాలున్నమాట నిజం. అయితే వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో మాత్రం అక్కడి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు విఫలమైన మాట నిజం.


జమ్ము కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలు. అక్కడ అధికారంలోకి రావడానికి ఒకదానిపై మరొకటి పోటీపడుతుంటాయి. విభేదాలను, సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి ఒకదానితో మరొకటి జతకట్టి పాలన సాగించాయి. తాజాగా బద్ధవిరోధులైన బీజేపీ, పీడీపీలు సంయుక్తంగా మూడేళ్లపాటు రాజ్యమేలాయి. విభేదాలు రావడంతో ఈ మధ్యే విడిపోయి రాష్ట్రాన్ని రాష్ట్రపతి చేతిలో పెట్టాయి. అప్పటి నుంచి ఇక్కడ కేంద్రం పెత్తనం ఎక్కువైపోయిందనే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రపతి పాలన ముసుగులో కేంద్రం ఇక్కడ అణచివేతకు పాల్పడుతోందని స్థానికులు కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నారు. వీటిని మీడియా బాహ్యప్రపంచానికి చెప్పట్లేదని, మీడియాపైన సైతం ఆంక్షలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తాము అధికారంలోకి వస్తే ఉగ్రవాదమనేదే లేకుండా చేస్తామని చెప్పుకొచ్చింది బీజేపీ. ఓసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిజం మొత్తాన్ని తరిమికొట్టామని ప్రగల్భాలు పలికింది. అవసరమైతే మరోసారి అలాంటి స్ర్టైక్స్ జరిపేందుకు వెనకాడబోమని హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ఈ స్ట్రైక్స్ ఏమాత్రం టెర్రరిస్టుల పీకమణచలేకపోయాయని స్పష్టమైంది. దేశంలోనే అతి పెద్ద అటాక్ చేసేలా ఉసిగొల్పాయి. టెర్రరిస్టులు ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని ఈ నెల 8వ తేదీన ఇంటెలిజెన్స్ హెచ్చరించినా సైన్యం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఫలితమే 39 మంది జవాన్లు అమరులయ్యేలా చేసింది.


కేంద్రంలోని మోదీ సర్కార్ అతి విశ్వాసమే టెర్రరిస్టుల ఎటాక్ కు కారణమనే వాదనలు కూడా లేకపోలేదు. తామున్నంతవరకూ టెర్రరిస్టులు భారత భూభాగంలో అడుగు పెట్టే సాహసం చేయలేరని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ ధోరణే టెర్రిరిస్టులను ప్రేరేపించేలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అంతేకాక సర్జికల్ స్ట్రైక్స్ తో తాము పైచేయి సాధించామని చెప్పుకుంటున్న మోదీ సర్కార్ కు బుద్ది చెప్పాలనే ఉద్దేశంతోనే టెర్రరిస్టులు అతి పెద్ద దాడికి పాల్పడ్డాయని భావించవచ్చు. పైగా ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ దాడి కచ్చితంగా రాజకీయాలపైన, ఎన్నికల్లో ఫలితాలపైన ప్రభావితం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: