ఎడిటోరియల్ : దగ్గుబాటిని చేర్చుకోవటంలో పెద్ద వ్యూహమే ఉందట

Vijaya

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ చెంచురామ్ ను వైసిపిలోకి చేర్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. దగ్గుబాటి ఫ్యామిలినీ వైసిపిలోకి చేర్చుకోవటంలో కమ్మ సామాజికవర్గ పరంగా బ్రహ్మాండమైన లాభం చేకూరుతుందని జగన్ అనుకోవటం లేదు. కానీ అంతకుమించిన ఉపయోగమే ఉంటుందన్న అంచనాతో పార్టీలోకి ఆహ్వానించారని పార్టీ వర్గాలు చెప్పాయి. దగ్గుబాటిని ముందుపెట్టి చంద్రబాబునాయుడు వెన్నుపోటు ఉదంతాన్ని మళ్ళీ తెరపైకి తేవటమే జగన్ టార్గెట్ గా తెలుస్తోంది.

 

ఎన్టీయార్  1995లో వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోవటం తర్వాత మనోవ్యధతో మరణించటం అందరికీ తెలిసిందే. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటంలో ప్రధాన పాత్ర చంద్రబాబుదే. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు కొడుకులు, కూతుళ్ళది సహాయక పాత్రలు మాత్రమే. కుటుంబసభ్యుల్లో కూడా కొడుకులు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకం.  ఎన్టీయార్ ను పదవిలోనుండి దింపేసిన తర్వాత చంద్రబాబు సిఎం అయిపోయారు. తర్వాత తోడల్లుడు దగ్గుబాటితో పాటు కొడుకులు ఇతర కుటుంబసభ్యులందరినీ చంద్రబాబు దారుణంగా మోసం చేసిన విషయం తెలిసిందే.

 

జరిగిన మోసాన్ని అర్ధం చేసుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కూతురు పురంధేశ్వరి తర్వాత పశ్చాత్తపం చెంది మళ్ళీ ఎన్టీయార్ పంచన చేరారు. తర్వాత వెన్నుపోటు వ్యవహారం మొత్తంపై దగ్గుబాటి ఒక పుస్తకం కూడా అచ్చేశారు. ఎన్టీయార్ కు తాను చేసిన ద్రోహానికి బహిరంగంగానే దగ్గుబాటి క్షమాపణ కూడా చెప్పారు లేండి అది వేరే సంగతి. అప్పటి నుండి దగ్గుబాటి కుటుంబానికి చంద్రబాబుకు మధ్య మాటల్లేవు. తాజాగా దగ్గుబాటి వైసిపిలో చేరటం వల్ల వెన్నుపోటు ఉదంతాన్ని మళ్ళీ తెరపైకి తేవాలన్నది జగన్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

 

వెన్నుపోటు ఉదంతం మొత్తాన్ని చంద్రబాబు తర్వాత దగ్గుబాటి మాత్రమే పూర్తిగా వివరించగలరు. అలాంటిది ఇపుడు వైసిపిలో చేరిన దగ్గుబాటిని వెన్నుపోటులో చంద్రబాబు పాత్రను జనాలకు చెప్పించాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటు గురించి ఇతరులు ఆరోపించటం వేరు దగ్గుబాటి చెప్పటం వేరు. పైగా చంద్రబాబు వెన్నుపోటు గురించి స్వయంగా ఎన్టీయారే విడుదల చేసిన ఇంటర్వ్యూలు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి దగ్గుబాటిని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి చంద్రబాబును దగ్గుబాటి ద్వారా ఎండగట్టాలన్నది జగన్ వ్యూహమట.

 

చంద్రబాబు విభేదించి దూరమైన తర్వాత పుస్తకం రాయటం తప్ప ఇతరత్రా వెన్నుపోటు గురించి దగ్గుబాటి గురించి పెద్దగా మాట్లాడింది లేదు. కానీ తాజాగా దగ్గుబాటి వైసిపిలో చేరటంపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఎన్టీయార్ ఇమేజిని దెబ్బ తీయటానికే దగ్గుబాటి, లక్ష్మీపార్వతి వైసిపిలో చేరారంటూ చంద్రబాబు టెలికాన్ఫరెన్సులో ఆరోపించారు. పైగా అధికారం కోసమే దగ్గుబాటి వైసిపిలో చేరారనటం మరీ విచిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో చేరితే అధికారం కోసమని ఎలాగంటారో అర్ధం కావటం లేదు. అంటే దగ్గుబాటిని చంద్రబాబు కెలికిన నేపధ్యంలో దగ్గుబాటి ఎలా స్పందిస్తారో ? జగన్ వ్యూహం ఎలా వర్కవుటవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: