హోదాయే ఊపిరిగా...కాకినాడలో ‘వంచనపై గర్జన’సభ!

Edari Rama Krishna
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రతిపక్ష వైసీపీ ముమ్మరం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతిపక్ష వైసీపీ నేడు నిర్వహించనున్న ‘వంచనపై గర్జన’ సభకు కాకినాడ సిద్ధమైంది. హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని,  ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ నినాదంతో తొలి నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటం చేస్తున్నారు. 


ఈ జిల్లాలోనైతే ఇప్పటికే రెండుసార్లు పర్యటించి హోదా కోసం ఎలుగెత్తి చాటారు.  ఓ వైపు ప్రజా సంకల్ప యాత్ర చేపడుతూనే జగన్  ‘వంచనపై గర్జన’ప్రజల్లో స్పూర్తిని నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.   ఈ క్రమంలోనే ఏపికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ..  కాకినాడలో 'వంచనపై గర్జన' బహిరంగ సభలో వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించనున్నారు.  


బాలాజీ చెరువు సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు సభ కోసం ఏర్పాట్లు పూర్తిచేశాయి.  ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, నగర నియోజకవర్గ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి హాజరవుతున్న మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర నేతలు, సమన్వయకర్తలతోపాటు వేలాదిగా తరలివచ్చే ప్రజలు పాల్గొనబోతున్నారు. 


 ఈ నిరసన కార్యక్రమంలో నలుపురంగు దుస్తులతో వైసీపీ నేతలు హాజరు కానున్నారు. ప్రత్యేకహోదాపై ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, నెల్లూరులో వైసీపీ ‘వంచనపై గర్జన’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, కాకినాడ 'వంచనపై గర్జన' సభకు అన్నిపక్షాలు కలిసిరావాలని వైసీపీ పిలుపునిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: