ఈ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం జ‌వాబు చెబుతుందా ?

Vijaya
కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య నిధుల విష‌యంలో కొద్ది రోజులుగా  ఎంత ర‌చ్చ జ‌రుగుతోందో అంద‌రికీ తెలిసిందే. వివిధ ప‌థ‌కాల‌కు నిధులిచ్చాన‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం చెబుతుంటే ఇవ్వ‌లేద‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఎదురుదాడి చేస్తోంది.  కేంద్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు, రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ప్లానింగ్ క‌మిష‌న్ ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు చాలా రోజులుగా కీచులాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని బిజెపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లూ అంద‌రూ వింటున్న‌దే. వీరి వాద‌న వింటుంటే ఎవ‌రు చెప్పేది నిజ‌మో ? ఎవ‌రి వాద‌న అబ‌ద్ద‌మో ఒక‌ప‌ట్టాన ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. 


ప‌ట్టిసీమ‌లో అవినీతి వాస్త‌వం కాదా ?


స‌రే, వీరిద్ద‌రి వాద‌న ఎలాగున్నా జ‌నాల మ‌దిలో కొన్ని మౌళిక‌మైన  ప్ర‌శ్న‌లు మెదులుతున్న‌మాట వాస్త‌వం. ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సిన బాధ్య‌త మాత్రం రాష్ట్ర‌ప్ర‌భుత్వంతో పాటు కుటుంబ‌రావు మీదుంది. ఇంత‌కీ ఆ ప్ర‌శ్న‌లేమిటంటే ?  మొద‌ట‌గా ప‌ట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 370 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) స్ప‌ష్టంగా చెప్పిన విష‌యం కుటుంబ‌రావుకు తెలీదా ?  అలాగే, రూ. 1583 కోట్లు లెక్క‌లు చూప‌కుండా ప‌ర్స‌న‌ల్ డిపాజిట్ ఖాతాల్లోకి మ‌ళ్ళించ‌టాన్ని కాగ్ త‌ప్పు ప‌ట్ట‌లేదా ?


ప్రాజెక్టుల అంచ‌నా వ్య‌యం ఎందుకు పెరిగింది ?


స్ధానిక సంస్ధ‌ల‌కు ఇవ్వాల్సిన నిధుల్లో రూ. 130 కోట్లు వృధా అయిన‌ట్లు కాగ్ ఎత్తి చూపింది. చేసిన ఖ‌ర్చుల‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఇంత వ‌ర‌కూ లెక్క‌లు చెప్ప‌ని మాట వాస్త‌వం కాదా ?  31 ఇరిగేష‌న్ ప్రాజెక్టులు పూర్త‌వ్వాలంటే అంచ‌నా వ్యయాల‌ను పెంచాల్సిందే అంటూ ఒక్క‌సారిగి రూ. 27,403 కోట్ల‌ను పెంచినా ఇంకా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టాన్ని కాగ్ త‌ప్పుప‌ట్టింది క‌దా ?  నీరు-చెట్టు ప‌థ‌కానికి బ‌డ్జెట్లో రూ. 135 కోట్లు కేటాయించి చివ‌ర‌కు రూ. 1242 కోట్లు ఎలా ఖ‌ర్చు అయ్యిందో చెప్ప‌మంటే ప్ర‌భుత్వ ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టాన్ని కాగ్ త‌ప్పుప‌ట్టిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. 


ఎంఎల్ఏల క్వార్ట‌ర్ల నిర్మాణం పూర్త‌య్యిందా ?


ఇక‌,  అత్య‌ధిక ధ‌ర‌ల‌కు హై సెక్యూరిటీ నెంబ‌ర్ ప్లేట్ల కొనుగోలు చేయ‌టం, వాడ‌క‌పోయిన రూ. 14.33 కోట్లు  హెలికాప్ట‌ర్ అద్దె చెల్లించిన‌ట్లు బిల్లులు చూప‌టం, మొద‌టి అంత‌స్తు స్లాబు వేస్తున్న ఎంఎల్ఏ క్వార్ట‌ర్స్ నిర్మాణం పూర్తి చేసిన‌ట్లు చెప్పి రూ. 770 కోట్లకు యుటిలైజేష‌న్ బిల్లులు పెట్ట‌టం లాంటి అనేక విష‌యాల్లో కాగ్ ప్ర‌భుత్వ నిర్వాకాన్ని తూర్పార‌బ‌ట్టిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  పోల‌వ‌రం నిర్మాణంలో అవినీతి జ‌రిగిందా లేదా అన్న‌ది అప్ర‌స్తుతం. ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక‌రైల్వేజోన్, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ రాక‌పోవ‌టానికి కార‌ణ‌మెవ‌రు ?  బాధ్య‌త ఎవ‌రిది ? అనే చ‌ర్చ‌ల‌కు అంతుండ‌దు. కాబ‌ట్టి ఇప్ప‌టికే కాగ్ త‌ప్పుప‌ట్టిన విష‌యాలపై కుటుంబ‌రావు కానీ మంత్రులో ఎవ‌రో ఒక‌రు స‌మాధానం చెబితే స‌రిపోతుంది. ఏమంటారు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: