చంద్రబాబు 'కొంగ జపాలు-దొంగ దీక్షలు' ప్రజావిశ్వాసం పొందలేవు: వైసిపి జగన్

పదే పదే తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ  అనుభవం గుఱించి మాట్లాడే చంద్రబాబు గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. అదేమంటే చేయాల్సిన పని సకాలంలో చేసినా, నిబద్ధతగా సంకల్పంతో పనిచేసినా ప్రజలే సుధీర్ఘ అనుభవం గుర్తిస్తారు. తాను చేసే పనికి ప్రజలనుండి నైతిక మద్దతే కాదు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ మద్య చంద్రబాబు మాటలన్నీ పేలవంగాను, ఆత్మవిశ్వాసం లేనివిగాను వినబడుతున్నాయి. అసలు సారమే లేకుండా పోతున్నాయి. 

"ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రతిపత్తి సాధన" కోసం తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయించవలసిన సమయంలో రాజీనామాలు చేయించ కుండా, ఆమరణ నిరాహార దీక్షలో వారిని కూర్చోనివ్వకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీక్షకు సిద్థం కావటాన్ని "కొంగ జపం – దొంగదీక్ష" అని వైసిపి  అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి అపహస్యం చేస్తూ విమర్శించారు.  నారా చంద్రబాబు నాయుడుది అంతా రాజకీయమేనని హృదయపూర్వక సంకల్పం కాదని ప్రతిదానికి "వన్‌ డే ఫార్ములా" అని, అంతా తన స్వంత మీడియా కోసం చేసే ప్రచారార్భాటమేనని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి సాధన కోసం పార్లమెంట్‌లో వీరోచితపోరాటం అనంతరం తమపార్టీ పార్లమెంట్ సభ్యులు తమ పదవులను తృణప్రాయంగా త్యజించి రాజీనామాలేఖలు స్పీకర్-ఫార్మాట్ లో సమర్పించివస్తే, టిడిపి మాత్రం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా, 'సరైన తరుణంలో సరైన నిర్ణయం'  తీసుకో కుండా అసలు ప్రత్యేక హోదా రాకుండా దానికోసం వత్తిడి తేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ తన సంకల్పలేమిని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు లేకి తనంతో "ఒక రోజు దీక్ష"అంటూ 'తన పార్టీ వందిమాగదులతో తన పచ్చ-మీడియా బాజాబజంత్రీలతో పెద్ద నాటకం' మొదలుపెట్టారని జగన్ విమర్శలు గుప్పించారు.   

ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందుకు నిరసనగా రాజీనామా చేసిన వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను బుధవారం సాయంత్రం కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం శోభనాపురంవద్ద బసలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంపీల రాజీనామాలు, ఏపీభవన్‌ వేదికగా దీక్ష, రాష్ట్రపతి తో భేటీ తదితర పరిణామాలను అధినేతకు వివరించారు. 

అనంతరం పార్టీ ఎంపీల పోరాటాన్ని అభినందిస్తూ జగన్‌ మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది ఎంపీలు రాజీ నామాలు చేసి, ఆమరణ దీక్షకు దిగితే ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మరింత చర్చ జరిగి ఉండేదన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు.

ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాజాగా జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో పాల్గొనవద్దంటూ నోటీసులు జారీచేసి బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డా రని ప్రశ్నించారు. బంద్‌లో పాల్గొన్న వారిపై కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు ఈనెల 22న పార్టీ ఎంపీ లు, ప్రాంతీయనేతలతో మరోసారి సమావేశంకావాలని నిర్ణయించారు. సమావేశంలో ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: