జగన్ కు రూ.10 కోట్లు ఇచ్చానన్న లోకేశ్..! ఎందుకిచ్చారో తెలుసా..?

Vasishta

రాజకీయాలెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక కడప జిల్లా రాజకీయాలైతే మరీనూ..!! ఎందుకంటే ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహించేంది ఈ జిల్లాకే.! ప్రతిపక్షనేతగా ఉన్నందున తన నియోజకవర్గంపై ప్రభుత్వం కక్షగట్టిందని, పులివెందులలో పుట్టడమే శాపమైందని జగన్ గతంలో ఓసారి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి లేదంటున్నారు మంత్రి నారా లోకోశ్..


          పులివెందుల వై.యస్. కుటుంబానికి కంచుకోట. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలవని ఏకైక స్థానం పులివెందులే. అయితే ఈ సారి అక్కడ కూడా గట్టిపోటీ ఇవ్వాలని, 175 నియోజకవర్గాలనూ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. గట్టిగా ట్రై చేస్తే పులివెందులలోనూ గెలవడం అసాధ్యం కాదని చంద్రబాబు ఇటీవలే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


          పులివెందులనూ పాగా వేయాలనే లక్ష్యంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అధికార పార్టీ. ఇటీవలే హంద్రీనీవా నుంచి నీళ్లను గండికోట ప్రాజెక్టు ద్వారా పులివెందుల వరకూ పారించింది. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిస్తున్నట్టు ఆమధ్య చంద్రబాబు చెప్పారు కూడా.! పులివెందులలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకపోయినా మెజారిటీ భారీగా తగ్గించినా విజయం సాధించినట్టేనని టీడీపీ భావిస్తోంది.


          పులివెందులపై కక్ష గట్టామంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు మంత్రి లోకేశ్. జగన్ అడగకపోయినా పులివెందులకు రూ.10 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నామని వివరించారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడేది లేదన్నారు. లోకేశ్ చెప్పేంతవరకూ పులివెందులకు అన్ని నిధులు మంజూరయ్యాయనే విషయం ఎవరికీ తెలీదు. మరిప్పుడు వైసీపీ నేతలు ఏమంటారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: