మరో రెండ్రోజులు వానలే...వానలు.. జాగ్రత్త..!!

Vasishta

తెలుగు రాష్ట్రాలు జడివానతో తడిసి ముద్దవుతున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నదికి వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.


దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వెలగపూడిలోని సచివాలయంలో నీళ్లు నిలిచాయి. నాలుగో బ్లాకులో లీకేజీ వల్ల నీళ్లు చేరాయి. దీంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.


తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. అధికారులు వాటిని తొలగించే పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 17 అడుగులకు చేరింది.


ఇప్పటికే రెండ్రోజులుగా కురుస్తున్న వానలతోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల మరో 48 గంటలపాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


గత నెల వరకూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. తాజా వర్షాలతో ఖరీఫ్ జోరందుకుంటుందని వాతావరణ, వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ మంచి వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలో మాత్రం జల్లులు పడుతున్నాయి. అటు తెలంగాణలో కూడా వ్యవసాయం ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: