చంద్రబాబుని పొగుడుతున్న వైసీపీ నేతలు..? కేసుల నుంచి తప్పించుకోవడానికా?
వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. సీఎం చంద్రబాబు మంచోడని చెబుతున్నారు. ఆయన చాలా హుందాగా ఉంటారని చెప్పుకొస్తున్నారు. కొందరైతే అంతర్గత సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం బాహటంగానే చెప్పుకొస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన ఇంటిపై దండయాత్ర చేశారు అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్. వందలాది వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లి మరి.. చంద్రబాబు ఇంటి తలుపులను ధ్వంసం చేయడాన్ని ప్రయత్నించారు. కొడాలి నాని లాంటి వారు నోరు తెరిచి పది నిమిషాల పాటు మాట్లాడితే.. చంద్రబాబు తండ్రి పేరు నుంచి.. కుమారుడు లోకేష్ గురించి దారుణంగా మాట్లాడేవారు. వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన నేతలు వైసీపీలో అతి తక్కువ.
ఒక్కమాటలో చెప్పాలంటే రాజశేఖరరెడ్డి తో రాజకీయం చేసిన ఏ వైసీపీ నేత హుందాతనం మరిచి మాట్లాడలేదు. జగన్ ద్వారా పదవులు పొందిన వారు, పొందాలనుకున్నవారు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అయితే చంద్రబాబులో హుందాతనం గురించి ఇప్పుడు కొత్తగా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే వారు కేసుల నుంచి బయట పడాలనో.. కూటమి ప్రభుత్వం నుంచి తమకు ఇబ్బందులు ఎదురు కాకూడదని అలా కొత్త పల్లవి అందుకున్నారు. మాజీమంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య ఉన్నారు. ఆమెను అరెస్టు చేయించాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నం చేశారని.. కానీ చంద్రబాబు ఆమె అరెస్ట్ కు ఒప్పుకోలేదని.. ఆడవారితో రాజకీయాలు ఏంటని ప్రశ్నించారని తాజాగా పెర్ని నాని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు.
గత ఏడాది చంద్రబాబు అరెస్టయ్యారు. ఒక నాయకుడు రిమాండ్ ఖైదీగా అన్ని రోజులపాటు ఉండిపోవడం అదే తొలిసారి. ఆ సమయంలో చంద్రబాబు వయసు వైసీపీ నేతలకు గుర్తుకు రాలేదు. ఆయన గొప్పతనం గుర్తుకు రాలేదు. ఆయన హుందాతనాన్ని కూడా వీరు గుర్తించలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలతో పాటు బహిరంగంగానే చంద్రబాబు హుందాతనం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో టిడిపి శ్రేణులు సైతం గొప్పగా భావిస్తున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు హుందా భజనతో వైసీపీ నేతలు గడిపేస్తుండడం విశేషం.