ఏపీలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడనుంది.ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిల కోసం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ విషయంలో కొద్దిపాటి ఉపశమనం కల్పించాయి. కేవలం ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలను మాత్రమే నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఉచిత ఓపి సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు చెబుతున్నాయి. వాస్తవానికి ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ అన్ని రకాల సేవలను నిలిపివేయాలని భావించాయి. కానీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ముందుగా ఈ రెండు రకాల సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వంతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ఆరోగ్యశ్రీ సేవలు అందించమని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు.
సోమవారం నుంచి నగదు రహిత సేవలు అందించలేమని తెలిపారు.ఇదే విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులిచ్చామని బకాయిల భారాన్నిమోయలేకపోతున్నామని విజయక్ కుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రూ.1500 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా రూ.3 వేల కోట్లు బకాయిలున్నాయని గుర్తు చేశారు. తక్షణమే నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే ఆస్పత్రులను నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంక్‌లు కూడా సహకరించడం లేదన్నారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈవో ఫోన్‌లో చెప్పారని సోమవారం చర్చలకు రావాలన్నారని వివరించారు.ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. ఆరోగ్య బీమాలో కనీసం కో-పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దీనిపై స్పందించింది.
నెట్వర్క్ ఆసుపత్రుల సంఘాల ప్రతినిధులకు చర్చలకు ఆహ్వానించింది. దీంతో సేవల నిలిపివేతలపై పునరాలోచనలో పడ్డాయి యాజమాన్యాలు. కేవలం ఓపి, ఈ హెచ్ ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రేపు చర్చల్లో పురోగతి బట్టి తదుపరి నిర్ణయానికి రానున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు.ఇదిలావుండగా మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లోని 4 కోట్ల 30 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా రూ.25 లక్షల వరకు వైద్య సాయం అందుతుందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానం కానున్నాయని చెప్పారు.