యనమల అసంతృప్తి ఎవరిపై .. టీడీపీలో ఏం జరుగుతోంది...!
అసలేం జరిగింది.. ?
కాకినాడ సీ పోర్టు యజమానిగా ఉన్న కోనేరు వెంకటేశ్వరరావు(కేవీ రావు) నుంచి వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు.. సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అనుచరులు, బంధువులు.. బలవంతంగా వాటాలు రాయించు కున్నారని.. దీంతో కేవీ రావు తీవ్రంగా నష్టపోయారని.. తాజాగా సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా రు. మరోవైపు.. ఈ కేసును సీఐడీ విచారణ చేపట్టింది.
ఇది .. కూటమి సర్కారుకు కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ కేసు విచారణ ఇంపార్టెంట్ ఇష్యూ అయింది. అయితే.. ఇదే కేసులో సహకరించాల్సిన యనమల వంటి స్థానిక నాయకులు.. కేవీ రావుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. యనమల నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేవీ రావు... కూడా అక్రమాలు చేశారని పేర్కొంటూ.. పెద్ద బాంబు పేల్చారు. రైతులకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇవ్వలేదని.. ఆయన కూడా అనేక రూపాల్లో అక్రమాలు చేశారని పేర్కొన్నారు.
ఈ లేఖ సాధారణ నాయకుడు రాసి ఉంటే వేరేగా ఉండేది. కానీ, యనమల వంటి దిగ్గజ నాయకుడు రాయడం.. ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో చౌదరి అని పేర్కొనడం కూడా.. వివాదానికి దారితీసింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక యనమల అసంతృప్తితో ఉన్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు హయాంలో ప్రతిసారీ మంత్రిగా ఉన్న యనమలకు ఈ సారి పోస్టు దక్కలేదు. ఇదే ఆయన అసంతృప్తికి కారణమై ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇది టీ కప్పులో తుఫానుమాదిరిగా తొలగిపోతుందా? రాను రాను పెరుగుతుందా ? అనేది చూడాలి.