ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎక్కడో తాకాయి. దీంతో స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరుకాలేదు. ఆ తర్వాత కూడా అసెంబ్లీ కి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతుంటే అధికార కూటమికి కానీ, స్పీకర్ కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్ధితి.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం లో అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ ఇప్పుడు సీఎం కాదు.. ఒక ఎమ్మెల్యే మాత్రమే. అసెంబ్లీకి వచ్చి జగన్‌ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలి. అసెంబ్లీకి రాననడం సరికాదు. జగన్‌కు నా సలహా ఒకటే. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఒక ఎమ్మెల్యే గా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. దానికి నేను అవకాశం ఇస్తా. నేను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు మాట్లాడటానికి అవకాశం ఇస్తా’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఇప్పటికే జగన్ ను అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభా వ్యవహారాలమంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం, స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి రావాలని అయన్నపాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు.