గద్దర్..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు. పేద ప్రజల, పీడిత వర్గాల వైపు ఉంటూ తన గళాన్ని వినిపిస్తూ ప్రజా ఉద్యమాల నుంచి నక్సలైట్ ఉద్యమాల వరకు నడిపిన ఆదర్శప్రాయుడు. ఆయన గొంతు నుంచి ఎన్నో ప్రజా ఉద్యమ పాటలు బయటకు వచ్చాయి. అలాంటి ప్రజా యుద్ధనౌక గద్దర్ గొంతు మూగబోయి ఈనాటికీ ఏడాది గడిచింది. అలాంటి గద్దర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1949 లో నిరుపేద కుటుంబంలో జన్మించిన గద్దర్ భూస్వాములు, దోపిడీదారులకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించేవారు. అల్లూరి సీతారామరాజు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రలను చూసుకుంటూ పెరిగిన ఆయన బుర్రకథలు, ఒగ్గు కథల రూపంలో మట్టి మనుషుల్లో చైతన్యాన్ని కలిగించారు.
గద్దర్ పేరు చెప్పగానే చేతిలో కర్ర, దానికి ఎర్రని గుడ్డ,గోసి గొంగళి,కాళ్లకు గజ్జెలు కనిపిస్తాయి. "అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా" అనే పాట నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆయన గొంతు వినిపించారు. "ఎట్టోళ్ల మట్టి చిప్పవు.. గాయిదోళ్ల గాండ్ర గొడ్డలి" అంటూ తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రజలకు నేర్పాడు. ఈ విధంగా గద్దర్ గళం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు బయటకు వచ్చాయి. ఈ విధంగా నక్సలైట్ ఉద్యమంలో కూడా గద్దర్ ప్రముఖ పాత్ర పోషించారు. తుపాకీ తూటా దెబ్బలు కూడా తిన్నాడు.
పేద పీడిత ప్రజల వైపు ఎప్పుడూ ఉంటూ ప్రభుత్వం చేసే తప్పులను విమర్శిస్తూ పాటల రూపంలో ప్రజలలో చైతన్యం కలిగించిన గద్దర్ 75 ఏళ్ల వయసు వరకు 32 కేసుల్లో ఇరికారు. అలాంటి యుద్ధ నౌక తన జీవిత కాలమంతా పోరు బాటలో నడిచి 2023 ఆగస్టు 6వ తేదీన అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అంతటి పోరాటపటిమ కలిగినటువంటి గద్దర్ పోరాట స్ఫూర్తిని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకు బండు పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘన నివాళులు అర్పిస్తోంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా గద్దర్ కు ప్రజలంతా నివాళులర్పిస్తున్నారు.