వైఎస్ జ‌యంతి : ఫ‌స్ట్ టైం ఇందుకీ కాంట్ర‌వ‌ర్సీ..?

RAMAKRISHNA S.S.
- ఓట‌మితో వైఎస్సార్ సాఫ‌ల్య పుర‌స్కారాలు మ‌ర్చిన జ‌గ‌న్‌
- వైఎస్సార్ వార‌సురాలిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ష‌ర్మిల విశ్వ ప్ర‌య‌త్నం
- తండ్రి 75వ జ‌యంతోత్స‌వాల నేప‌థ్యంలో కుమార్తె బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌
( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సోమ‌వారం. అయితే, ఈ కార్య‌క్ర‌మం అంత ప్రశాంతంగా అయితే జరిగేటట్టు కనిపించడం లేదు. వాస్తవానికి ప్రతి సంవత్సరం వైఎస్‌ జయంతిని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆయ‌న‌ కుటుంబ సభ్యులు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ ఈసారి వైఎస్ జయంతి వివాదంగా మారుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఉన్న వైఎస్ కుమార్తె షర్మిల సొంతంగా వైయస్సార్ జయంతిని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె రాజకీయ కోణాన్ని ప్రస్తావించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఏడాది జరిగినటువంటి ఎన్నికల సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. రాజన్న రాజ్యం, రాజన్న పాలన అందించలేనటువంటి వ్యక్తులు వైయస్సార్ కు వారసులు ఎలా అవుతారంటూ ఆమె ఎన్నికలవేళ ప్రశ్నించారు. దీంతో అప్పటివరకు లేనటువంటి వైఎస్ వారసత్వ పోరు తొలిసారి తెర‌ మీదకు వచ్చింది. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో ఏపీని పాలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఐదు సంవత్సరాలు రాజన్న రాజ్యం అందిస్తానని ఆయన చెప్పారు. కొన్ని చేశారు కూడా.

అయిన‌ప్పటికీ రాజకీయ వైరుధ్యం కారణంగా తన సొంత సోదరి నుంచి ఎదురైనటువంటి విమర్శలను జగన్ తిప్పి కొట్టలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బలమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోయిన పరిస్థితిని గత ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఈ వివాదం మరింత రగులుతోంది. వైయస్ నిజమైన వారసురాలిగా తానేనని షర్మిల చెప్పకనే చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఆమె సోమవారం నిర్వహించ‌నున్న‌ వైఎస్ 75వ జయంతి  ద్వారా వారసత్వం బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు.

అయితే దీనికి తగ్గట్టుగా అటువైపు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్ల నిర్వహించారు. వైయస్సార్ సాఫల్య పురస్కారాల పేరుతో వైయస్ జయంతిని ఏటా ప్రభుత్వ కార్యక్రమంగా అయితే కొనసాగించారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతిని నిర్వహించాలని ముందు అనుకున్నప్పటికీ తర్వాత దానిని వద్దనుకున్నారు. ఈ కారణంతో జ‌గ‌న్‌ పులివెందులకే పరిమితమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఒక శాతం ఓటు బ్యాంకును అదనంగా తెచ్చుకుని కొంతమేరకు పుంజుకుంది.

ఈ నేపథ్యంలో షర్మిల ఈ వైయస్ జయంతి వేడుకలను ఆలంబనగా చేసుకొని పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే వైయస్ జయంతి ఈసారి వివాదాస్పదంగా మారేటటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ వారసత్వాన్ని ప్రధానంగా షర్మిల తన రాజకీయ అస్త్రం చేసుకుంటారనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: