ముళ్ల‌పూడి బాపిరాజు - శేషారావు... తూర్పు టీడీపీలో ఫ‌స్ట్ ఎవ‌రు...?

RAMAKRISHNA S.S.
- మంత్రి కందుల కోసం శేషారావు సీటు త్యాగం
- జ‌డ్పీ మాజీ చైర్మ‌న్‌, గోపాల‌పురం గెలుపులో బాపిరాజు కీ రోల్‌
- తూర్పు నామినేటెడ్‌లో ముగ్గురు ' క‌మ్మ ' ల మ‌ధ్యే గ‌ట్టి పోటీ..!
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో ఐదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడిన నేతలు.. పొత్తుల నేపథ్యంలో సీట్లు త్యాగం చేసిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు ఎలాంటి పదవులు దక్కుతాయని ఆసక్తిగా ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన ముళ్లపూడి బాపిరాజు, పొత్తులో భాగంగా నిడదవోలు సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, అటు రాజానగరం సీటు వదులుకున్న బొడ్డు వెంకట రమణ చౌదరికి ఎలాంటి పదవులు వస్తాయి.. అన్నది ఆసక్తిగా ఉంది. ముళ్ల‌పూడి బాపిరాజు పార్టీలో 20 ఏళ్లకు పైగా కీలకపాత్ర పోషిస్తున్నారు గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలతో పాటు మెట్ట ప్రాంతంలో బలమైన అనుచరుగణం కలిగి ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీ చైర్మన్‌గా పని చేసి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన బాపిరాజుకు.. 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కలేదు.

పైగా ఈసారి బాపిరాజుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఉమ్మడి జిల్లాలో చాలామంది పార్టీ కీలక నేతలు సైతం పట్టుబట్టే అవకాశం ఉంది. బాపిరాజు పార్టీ కోసం పడిన కష్టంతో పాటు పార్టీ కోసం పెట్టిన ఖర్చు అలాంటిది. ఎన్నిక‌ల‌కు ముందు అధిష్టానంతో ఉన్న గ్యాప్ సైతం చాలా చాక‌చ‌క్యంగా సెటిల్ చేసుకున్నారు బాపిరాజు. ఇక 2009, 2014 ఎన్నికలలో వరుసగా నిడదవోలు నుంచి గెలిచిన శేషారావు 2019లో ఓడిపోయారు. ఈసారి కచ్చితంగా సీటు తనదే గెలుస్తానని నిడదవోలులో బాగా పనిచేసుకున్నారు. అయితే మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలు రావడంతో.. శేషారావు సీటు వదులుకోక తప్పలేదు. రెండుసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు కూడా పార్టీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి వాస్తవంగా పెద్దాపురం సీటు ఆశించారు. చినరాజప్ప కోసం చంద్రబాబు వెంకటరమణ చౌదరిని రాజానగరం ఇన్చార్జిగా నియమించారు.

అక్కడ బాగా పనిచేసుకుంటూ పార్టీని బలోపేతం చేశారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు త్యాగం చేశారు. ఎలాంటి వివాదం లేకుండా రాజానగరం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన బ‌త్తుల‌ బలరామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించడంలో వెంకటరమణ ఎంతో కృషి చేశారు. ఈ విషయంలో ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మరి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలుగా ఉండి... తాము త్యాగాలు చేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను, కూటమి అభ్యర్థులను గెలిపించడంలో ఈ ముగ్గురి కృషి ఎంతో ఉంది. ఈ ముగ్గురు నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నా ముగ్గురు కమ్మ సామాజిక‌ వర్గానికి చెందినవారు కావడం ఒకింత మైనస్. అయితే ఈ ముగ్గురిలో ముళ్లపూడి బాపిరాజు నామినేటెడ్ ప్ర‌యార్టీలో ఫస్ట్ వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: