అనిత‌కు హోం క‌ష్ట‌మేనా.. ఆ శాఖ అయితే 100 % కరెక్ట్ అయ్యేది..!

RAMAKRISHNA S.S.
- స‌వాళ్ల పోలీసింగ్.. ఇది ముళ్ల కిరీట‌మే
- దిశ చ‌ట్టం... మ‌హిళ‌ల భ‌ద్ర‌త కీల‌కం
- స్త్రీ, శిశు సంక్షేమం అయితే క‌రెక్ట్ అంటోన్న విశ్లేష‌కులు
- జ‌గ‌న్‌ను ఫాలో అయ్యి అనిత‌కు హోం ఇచ్చేసిన బాబు
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
వంగ‌ల‌పూడి అనిత‌. తెలుగు దేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు. తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలిగా గ‌త ఐదేళ్ల కాలంలో అనేక పోరాటాలు చేసిన ద‌మ్మున్న మ‌హిళ‌గా గుర్తింపు పొంద‌రు. అందుకే చంద్ర‌బాబు ఏరికోరి మ‌రీ.. అనిత‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ప‌ట్టుబ‌ట్టి విశాఖ‌జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌క్కించుకోవ‌డంతోనే కాదు.. అక్క‌డ నుంచి భారీ మెజారీటీతోనూ ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో అనిత పోరాటం.. నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు వంటివి మెచ్చుకున్న చంద్ర‌బాబు ఎంతో మంది తమ‌కంటే త‌మ‌కే కావాల‌ని ఎదురు చూసిన రాష్ట్ర హోం శాఖ ను ఆమెకు అప్ప‌గించారు.

అయితే.. మంత్రి అనిత చేప‌ట్ట‌నున్న ఈ హోం శాఖ ఇప్పుడు స‌వాళ్ల‌తో కూడుకుని ఉంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ ను చంద్ర‌బాబు త‌న ద‌గ్గ‌రే పెట్టుకున్నా.. కీల‌క‌మైన విప‌త్తు నిర్వ‌హ‌ణ స‌హా.. స్టేష‌న్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి బాధ్య‌త‌ల ను అనిత‌కు అప్ప‌గించారు. అదేస‌మ‌యంలో జైళ్ల సంస్క‌ర‌ణలు, అగ్నిమాప‌క శాఖ‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ‌లు కూడా.. అనిత చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గంజాయి, మాద‌క‌ద్ర‌వ్యాల క‌ట్ట‌డి ఆమె కు స‌వాలుగా మార‌నుంది. అదేవిధంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను అరిక‌ట్ట‌డం కీల‌కంగా మారుతుంద‌నడంలో సందేహం లేదు.

ఇదే విష‌యాన్ని అనిత‌కూడా ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు గ‌త ప్ర‌భుత్వం దిశ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చినా.. కేంద్రం దీనికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో అనిత ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌. ఆ చ‌ట్టాన్ని స‌వ‌రించి కేంద్రం నుంచి అనుమ‌తులు తెచ్చుకుని మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తారా?  లేక ఆ చ‌ట్టం స్థానంలో కొత్త దానిని తీసుకువ‌స్తారా? అనేది చూడాలి. ఇక‌, స్టేష‌న్ల‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీసుకురావ‌ల్సి ఉంది. దీనికి గ‌త ప్ర‌భుత్వం కొంత మేర‌కు కృషి చేసింది. సీసీ కెమెరాలు పెట్టాల‌న్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమ‌లు చేయాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ.. అనిత‌కు త‌ల‌కు మించిన భారంగానే మార‌నున్నాయి.

మ‌రీ ముఖ్యంగా పోలీసుల‌కు వీక్లీఆఫ్‌ల వ్య‌వ‌హారం అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. దీంతో పోలీసులు విసిగిపోతున్నార‌నేది వాస్త‌వం. హోం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న అనిత‌కు ఇదే విష‌యంపై పోలీసు శాఖ కూడా విన్న‌వించేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో అనిత నిర్ణ‌యం హైలెట్ కానుంది. అయితే.. అస‌లు.. ఈ బాధ్య‌త‌లు కాకుండా.. ఆమెకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ను అప్ప‌గించి ఉంటే.. మ‌రింత మెరుగైన ఫ‌లితం వ‌చ్చి ఉండేద‌న్న సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి. కానీ, చంద్ర‌బాబు మాత్రం గ‌తంలో జ‌గ‌న్ అనుస‌రించిన విధానంలోనే మ‌హిళ‌ల‌కు అందునా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి హోం శాఖ ఇవ్వడం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: