"కొంచెం ఇష్టం..కొంచెం కష్టం".. బాలయ్య అఖండ 2కే ఎందుకు ఇలా జరుగుతుంది..?
కలెక్షన్స్ పరంగా చూస్తే, వైజాగ్ ఏరియాలో ఈ సినిమాకు సుమారు 45 కోట్ల రేషియో పడినట్టు సమాచారం. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేసరికి దాదాపు 40 కోట్ల రేషియో కనిపిస్తోంది. మొత్తంగా ఆంధ్రా ఏరియా నుంచి 40 నుంచి 45 కోట్ల మధ్య బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో చూస్తే సుమారు 20 నుంచి 25 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ ఏరియాల్లో పూర్తిస్థాయి రికవరీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, కామన్ ఆడియన్స్‌ను మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. మీడియా నుంచి కూడా పెద్దగా పాజిటివ్ స్పందన రాలేదని అంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. దీనికి ప్రధాన కారణంగా దర్శకుడు మాస్ యాక్షన్ సీన్స్ విషయంలో టూ మచ్ లిబర్టీ తీసుకున్నాడని, కథ కంటే యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే సీడెడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు ఏరియాలో మాత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. తొలి వీకెండ్‌లో ఈ ఏరియాలో రావాల్సిన మొత్తంలో సగం వరకు వసూలు చేయగలిగింది. ఇక్కడ తొలి వీకెండ్ మొత్తం కలిపి సుమారు 9 కోట్ల షేర్ రాగా, గుంటూరు ఏరియాలో దాదాపు 4 కోట్ల వరకు వచ్చింది.ఈ లెక్కలన్నింటిని పరిశీలిస్తే, అఖండ 2 కొంతవరకు సేఫ్ జోన్‌లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే అసలు సమస్య కోస్తా బెల్ట్ నుంచే వస్తోంది. ముఖ్యంగా వైజాగ్ ఏరియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అక్కడ ఇప్పటికీ మూడోవంతు రికవరీ కూడా పూర్తికాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఇక క్రిస్మస్, సంక్రాంతి పండుగలు దగ్గర పడటమే ఈ పరిస్థితికి ఒక ప్రధాన కారణమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈరోజు నుండి థియేటర్ల సంఖ్య తగ్గడం, టికెట్ రేట్లు తగ్గిపోవడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల కలెక్షన్స్‌లో కచ్చితంగా కొంత డౌన్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు నైజాం లో సుమారు 12 కోట్ల వరకు షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం బిజినెస్‌లో దాదాపు సగం వరకు రికవరీ అయినట్టే. ఇక మిగిలిన రోజుల్లో భారీగా కలెక్షన్స్ వస్తాయని పెద్దగా ఆశలు పెట్టుకోవడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం 40 శాతం పైగా స్టడీగా కలెక్షన్స్ కొనసాగితేనే బయ్యర్లకు కొంత ధైర్యం వస్తుందని అంటున్నారు.
మొత్తంగా చూస్తే, అఖండ టూ సినిమా రిజల్ట్ ఒక పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. కొన్ని ఏరియాల్లో బీభత్సమైన కలెక్షన్స్ నమోదు అవుతుంటే, మరికొన్ని ఏరియాల్లో మాత్రం నిరాశాజనక వసూళ్లు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఒక సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ లేదా ఫుల్ నెగటివ్ టాక్ వస్తుంది. కలెక్షన్స్ కూడా అదే దిశలో ఉంటాయి. కానీ అఖండ 2 విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.ఏపీ, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల నష్టాలు తప్పవని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే జీఎస్టీ రిటర్న్స్ ద్వారా కొంతవరకు రికవరీ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చివరికి అఖండ 2 ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్నది రాబోయే రోజుల్లోనే స్పష్టత రావాల్సి ఉంది.