ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కిన కొడాలి నాని.. అధికారులు ఏం చేస్తున్నారో?

Suma Kallamadi
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం ఆదేశాలతో రాజకీయ నేతల ముఖాలకు అధికారులు ముసుగులు కప్పుతారు. అంతేకాకుండా అధికారం అంతా ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంటుంది. మంత్రులకు అధికారాలు ఉండవు. ఎమ్మెల్యేలకు సైతం ఉండవు. ఎవరైనా ఎన్నికల సంఘం నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే చాలా చోట్ల ఎన్నికల సంఘం నిబంధనలకు రాజకీయ నేతలు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు తమకు పట్టవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందడమే లక్ష్యంగా ఆయా సామాజిక తరగతికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. ఇదే అలుసుగా తీసుకుని కొందరు నేతలు నిబంధనలు మీరుతున్నారు. బహిరంగంగా తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీలోని వైసీపీ కీలక నేత, గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఓ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఎన్నికల నిబంధనలను పట్టించుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుడివాడ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం అక్కడ వెనిగండ్ల రామును బరిలోకి దించింది. ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గం. దీంతో నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు వారి వైపు మళ్లే అవకాశం ఉంది. ఇక కాపులు కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరించనున్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని కీలకమైన పని చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు కప్పుతారనే విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిబంధనలను కొడాలి నాని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాపుల ఆరాధ్యనీయుడు వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన ముసుగు తొలగించారు. ఆయన విగ్రహానికి కొడాలి నాని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ విషయం బయటకు పొక్కినా ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో వైపు మరిన్ని ఎన్నికల నిబంధనలను కొడాలి నాని పాటించడం లేదు. తాజాగా వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. అయితే ఈ సమావేశం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగించడం గమనార్హం. దీనిని కూడా ఎన్నికల అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇదే పద్ధతి కొనసాగితే ఎన్నికల సంఘం నిబంధనలను ఇతర నేతలు సైతం పక్కన పెట్టేస్తారని అంతా చర్చించుకుంటున్నారు. కోడ్ ఉల్లంఘనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: