ఇదేందయ్యా ఇది.. మగాళ్ళ కోసం డ్వాక్రా సంఘాలు..? చంద్రబాబు హా మజాకా!

డ్వాక్రా సంఘాలు అంటే మహిళలే గుర్తుకు వస్తారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయంశక్తి సంఘాల పేరిట దాదాపు మూడు దశాబ్దాల క్రితం మహిళా సంఘాలు ఏర్పాటయ్యాయి.  దాదాపు 30 ఏళ్లుగా విజయవంతమైన ఈ ఫార్ములాను పురుషులకు వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది.  మహిళా సంఘాల మోడల్లో పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటుచేసి రుణాలిప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని భావిస్తోంది.


ముఖ్యమంత్రి చంద్రబాబు 1995లో తొలిసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు.  మహిళల్లో చైతన్యం నింపడంతోపాటు వారి ఆర్థిక ప్రగతికి పునాదులు వేశారు.  ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. మహిళల పేరిట బ్యాంకులు రుణాలివ్వడం, వారే ప్రతి నెలా సక్రమంగా చెల్లించే చూసేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది.



ఇదే సమయంలో పురుషులు ఉపాధి కోసం రుణాలు దొరకడం కష్టంగా మారింది. బ్యాంకులు రోజులు తరబడి తిప్పుకుంటున్నాయి. దీంతో చిరువ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టతరమవుతోంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  ఆన్ లైన్ రుణాల వేధింపులు ఎదుర్కొంటున్నారు.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ఆలోచించి మహిళా సంఘాల మోడల్లోనే పురుషులతోనూ సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ఆదేశించారు.  


పురుష సంఘాలను కామన్ ఇంట్రెస్టు గ్రూపుగా పిలుస్తున్నారు. రుణాల కోసం ఒకే రకమైన ఆసక్తితో ఉన్నవారు ఈ గ్రూపుల్లో చేరవచ్చు. భవన నిర్మాణ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, వాచ్ మన్, జొమాటో, స్విగ్గీ డెలవరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేసుకునే కార్మికులు, వీధి వ్యాపారులు ఈ గ్రూపుల్లో చేరవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులను ఈ గ్రూపుల్లో సభ్యులుగా చేర్చుతారు. కనీసం ఐదుగురితో ఒక గ్రూపు ఏర్పాటు చేసి వారితో బ్యాంకు అకౌంట్ ప్రారంభించి పొదుపు ద్వారా రుణాలిప్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.


ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో ప్రారంభించిన ఈ కామన్ ఇంట్రెస్టు గ్రూపులు ప్రస్తుతం 20 పని ప్రారంభించాయి. ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: