గుంటూరు రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌లో టీడీపీ, వైసీపీ వ‌ల‌స నేత‌ల‌దే హ‌వా..?

RAMAKRISHNA S.S.
- వేమూరు, ప్ర‌త్తిపాడులో వ‌ల‌స నేత‌ల‌కే వైసీపీ టిక్కెట్లు
- కోడుమూరు నుంచి ప్ర‌త్తిపాడుకు టీడీపీ రామాంజ‌నేయులు
- మూడు సీట్ల‌లోనూ క్యాండెట్ల‌ షిఫ్టింగ్‌ చేసిన జ‌గ‌న్‌
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల పార్లమెంటు సీటుతో పాటు.. వేమూరు, ప్రతిపాడు, తాడికొండ ఎస్సీ సెగ్మెంట్లుగా ఉన్నాయి. తాజా ఎన్నికలలో జగన్ మూడు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను తారుమారు చేశారు. మాజీ హోం మంత్రి సుచరితను ప్రతిపాడు నుంచి తాడికొండకు మార్చి.. ప్రకాశం జిల్లా కొండపి సీటు ఆశించిన వరికుటి అశోక్ బాబును వేమూరుకు మార్చారు. ఇక విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్‌కు ప్రతిపాడు సీటు ఇచ్చారు. నిజం చెప్పాలంటే ప్రతిపాడు వదిలి తాడికొండలో పోటీ చేయటం సుచరితకు ఇష్టం లేదు. వేమూరులో మంత్రిగా ఉన్న మెరుగు నాగార్జునకు సంతనూతలపాడు వెళ్ళటం.. ఇటు అశోక్ బాబుకు ప్రకాశం నుంచి వచ్చి వేమూరులో పోటీ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు.

ఆయినా జగన్ బలవంతంగా మార్పులు చేర్పులు చేయడంతో వీరంతా ఆయా నియోజకవర్గాలలో అయిష్టంగానే పోటీ చేస్తున్నారు. ఎక్కడో విజయవాడకు చెందిన కిరణ్ కు ప్రతిపాడు సీటు ఇవ్వటం ఏంటని.. స్థానిక వైసీపీ కేడ‌ర్ గగ్గోలు పెడుతోంది. వేమూరులో 20 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్న నాగార్జునను కాదని ముక్కుముఖం తెలియని అశోక బాబుకు ఇక్కడ సీటు ఇవ్వటం ఏంటని ? వేమూరు వైసీపీ క్యాడర్ తలను పట్టుకుంటుంది. ఏది ఏమైనా మూడు చోట్ల వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. ఆయా నియోజకవర్గాలలో ఉన్న వైసీపీ క్యాడర్లో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. నాలుగోసారి అక్కడే పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో తాడికొండలో స్వల్ప తేడాతో ఓడిన తెనాలి శ్రావణ్.. మరోసారి అక్కడే బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో ప్రతిపాడులో టీడీపీ నుంచి ఓడి.. పార్టీ మారి తిరిగి ఇప్పుడు టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్థానంలో రాయలసీమ నుంచి అభ్యర్థిని చంద్రబాబు దిగుమతి చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి గత ఎన్నికలలో కర్నూలు జిల్లాలోని కోడుమూరులో పోటీ చేసి ఓడిన రామాంజనేయులు ఈసారి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాజధాని మార్పు ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కూటమి పలు నియోజకవర్గాలలో బ‌లంగా ఉంది. ఈసారి ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీకి గట్టి ఎదురు దెబ్బతప్ప‌ద‌న్న‌ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: