గ్రంధి వర్సెస్ పులపర్తి.. భీమవరం బుల్లోడు అనిపించుకునే నేత ఆయనేనా?

Reddy P Rajasekhar
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా కూటమి నుంచి తుది మేనిఫెస్టో మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేయనుండగా జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) పోటీ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా ప్రస్తుతం గ్రంధి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
 
గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం జనసేనకు దక్కగా ఓడిన చోటే మళ్లీ గెలవాలనే పట్టుదలతో అంజిబాబు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో తర్వాత రోజుల్లో టీడీపీ పట్టు కోల్పోయింది.
 
భీమవరం నియోజకవర్గంలో మొత్తం రెండున్నర లక్షల ఓట్లు ఉండగా కాపులు, క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. అటు గ్రంధి శ్రీనివాస్ ఇటు పులపర్తి అంజిబాబు ఇద్దరూ కాపు నేతలే కావడంతో కాపు ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపితే వాళ్లే సులువుగా గెలిచే ఛాన్స్ ఉంది. జనసేన నుంచి పోటీ చేయడం పులపర్తికి ప్లస్ అవుతోంది. ప్రస్తుతం భీమవరంలో కూటమికి ఎడ్జ్ ఉంది. పులపర్తి గెలిచే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు గ్రంధి శ్రీనివాస్ కు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. భీమవరంలో వైసీపీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలలో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో మెజారిటీ సందర్భాల్లో అధికారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా భీమవరం అటు కూటమికి ఇటు వైసీపీకి కీలకం కానుంది. గ్రంధి, పులపర్తిలలో ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచి భీమవరం బుల్లోడు అని అనిపించుకునే నేత ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: