ఏపీ: వైసీపీ నేతల తీరుతో దిక్కుతోచని స్థితిలో వలంటీర్లు!

Suma Kallamadi
ఏపీలో ప్రస్తుతం వలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఎన్నికలు ముగిసే వరకు వారిని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సమయంలో వైసీపీ నేతల తీరుతో వలంటీర్లు రోడ్డున పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ సేవలు అందించాల్సిన వలంటీర్లు ఇలా రాజకీయ నేతల ప్రచారంలో పాల్గొనడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వారిని విధుల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో వలంటీర్ల దుస్థితి దయనీయంగా మారింది. తొలి నుంచి వలంటీర్లను తమ రాజకీయ ప్రచారాలకు వైసీపీ ఉపయోగించుకుంటోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న వలంటీర్లపై వేటు పడుతోంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ వైసీపీ నేతలే కారణమే వాదన వినిపిస్తోంది.
గ్రామ/వార్డు సచివాలయాలకు అనుబంధంగా వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ 50 ఇళ్లకు చెందిన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వారికి నెలకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తోంది. అయితే కీలకమైన ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండాల్సిన వలంటీర్లు రాజకీయ ప్రచారకర్తలుగా మారిపోయారు. వైసీపీ తరుపున పని చేస్తూ విమర్శలు తెచ్చుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటున్నారు. కొందరు వలంటీర్లు తమ విధులకు రాజీనామా  చేసి మరీ ప్రచారంలో ఉంటున్నారు.
వారిపై వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. తమ ప్రభుత్వమే వస్తుందని, తర్వాత తిరిగి నియమిస్తామని నమ్మబలుకుతున్నారు. అయితే చాలా మంది వలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు. ఇలాంటి వారిని ఎన్నికల కమిషన్ గుర్తిస్తోంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు వెంటనే విధుల నుంచి తప్పిస్తోంది. దీంతో ఇప్పటి వరకు తమ కుటుంబానికి బాసటగా నిలిచిన ఉద్యోగం పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. మరోవైపు తటస్థంగా ఉన్న వలంటీర్ల భవిష్యత్తుకు చంద్రబాబు హామీనిస్తున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించబోమని, వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా తీర్చిదిద్దుతామని భరోసానిస్తున్నారు. దీంతో వైసీపీ తరుపున రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న వలంటీర్లు, మాజీ వలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: