ఉత్తరాంధ్ర : ఈ మాజీమంత్రికి సీటే లేదా ?

Vijaya


రాజకీయ నేతల్లో మాజీమంత్రి, టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు స్టైలే డిఫరెంటుగా ఉంటుంది. ఈయన ఒకసారి పోటీచేసిన నియోజకవర్గంలో వెంటనే రెండోసారి పోటీచేయరు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. ఇప్పటివరకు గంటా ఆడింది ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. మరి రాబోయే ఎన్నికల్లో పరిస్ధితి ఏమిటన్నదే ఆసక్తిగా మారింది. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి గంటాకు అనువైన నియోజకవర్గం కనబడటంలేదట. గంటా పోటీచేయాలని చూస్తున్న నియోజకవర్గాల్లో మిత్రపక్షం జనసేన నేతలు ఆల్రెడీ కర్చీఫ్ వేసేశారట.



ఇదే సమయంలో సొంతపార్టీలో నేతలు కూడా తమ పోటీపై చాలా గట్టిగా టికెట్ల కోసం పట్టుబడుతున్నట్లు  సమాచారం. దాంతో గంటా ఎక్కడినుండి పోటీచేస్తారన్నది ఆకస్తిగా మారింది. 1999లో టీడీపీ తరపున మొదటిసారి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి గెలిచారు. తర్వాత 2004లో చోడవరం ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టడంతో అందులో చేరారు. పీఆర్పీ తరపున మళ్ళీ అనకాపల్లి ఎంఎల్ఏగా గెలిచారు.



తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు ఐదేళ్ళు హస్తంపార్టీ నేతగా చెలామణయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ తరపున పోటీచేస్తే డిపాజిట్లు రావని అర్ధమవటంతో మళ్ళీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో భీమిలీ తరపున పోటీచేసి గెలిచి మంత్రికూడా అయ్యారు. ఐదేళ్ళు గడిచేటప్పటికి గంటా కన్ను విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం మీద పడింది. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తరంలో పోటీచేసి గెలిచారు. అంటే ఐదు ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల నుండి పోటీచేసి ఐదుసార్లూ వరుసగా గెలుస్తునే ఉన్నారు. బహుశా రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి ఘనత మరెవరికీ లేదేమో.



అసలెందుకు గంటా ఎన్నికకో నియోజకవర్గాన్ని మారుస్తారు ? ఎందుకంటే ఈయనకు నియోజకవర్గం డెవలప్మెంట్ కన్నా తన వ్యాపారాలే ముఖ్యమట. ఏ నియోజకవర్గంలో గెలిచినా దాని అభివృద్ధిని పట్టించుకోరనే ఆరోపణలకు కొదవలేదు. ఒకసారి పోటీచేసిన నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీచేస్తే జనాలు ఓడగొడతారనే భయం వల్లే రెండోసారి పోటీచేయరట. ఇపుడు సమస్య ఏమిటంటే రేపటి ఎన్నికల్లో పోటీచేయటానికి సరైన నియోజకవర్గం లేదట. గాజువాక నుండి పోటీచేస్తారనే ప్రచారమైతే జరుగుతోంది. మరి ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: