అమరావతి : చంద్రబాబును దుమ్ము దులిపేశారా ?
పల్నాడులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి దుమ్ము దులిపేశారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేసిన సందర్భంగా జగన్ మాట్లాడుతు చంద్రబాబు నైజాన్ని జనాలకు వివరించి చెప్పారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటనే విషయాన్ని జనాలకు అనేక ఉదాహరణలు చూపించారు. జనాల మంచిగురించి చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదని ఎంతసేపు తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించినట్లు మండిపడ్డారు.
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మనం ఒక లెక్కా అంటు జగన్ ప్రజలను హెచ్చరించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని హామీలైనా ఇవ్వటానికి వెనకాడరని సెటైర్లు వేశారు. ఓట్లకోసం ప్రతి మనిషికి బెంజికారు, కేజీ బంగారం ఇస్తానని హామీలు ఇవ్వటానికి కూడా వెనకాడేరకం కాదన్నారు. లేస్తే మనిషిని కాదని చెప్పి బెదరించి పబ్బం గుడుపుకునే వ్యక్తికి మరోసారి అధికారం అప్పగిస్తే మోసం తప్ప ఇంకేమి చేయరన్నారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారం అందుకోగానే వాటిని తుంగలో తొక్కిన విధానాన్ని జగన్ ఉదాహరణలతో సహా వివరించారు. మ్యానిఫెస్టో అన్నా జనాలకు ఇచ్చిన హామీలన్నా చంద్రబాబుకు ఏమాత్రం లెక్కలేదన్నారు. కానీ తాను మాత్రం మ్యానిఫెస్టోను ఖురాను, బైబిల్, భగవద్గీతతో సమానంగా చూస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. తానిచ్చిన హామీలన్నింటినీ అమలుచేశానని జనాలు అనుకుంటే, ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే వైసీపీకి ఓట్లేసి గెలిపించమని విజ్ఞప్తిచేశారు.
చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లోమీడియా వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలను నమ్మవద్దన్నారు. ప్రజలందరు ఎవరికి వారుగా తమను తాము సమీక్షించుకోమన్నారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని అనుకుంటే మాత్రమే మళ్ళీఓట్లేసి తమను గెలిపించమని కోరారు. తప్పుడు హామీలిచ్చి తాను అధికారంలోకి రాలేదని, చెప్పిందే చేశాను, చేసేది చెబుతానని జగన్ ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ విషయం ఏమిటంటే జనాలకు తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పేస్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది జనాలు మాత్రమే.