రాజకీయాలకతీతంగా ప్రజల్లోకి వంగవీటి ఆశాకిరణ్ మాస్ ఎంట్రీకి ముహూర్తం!
ముఖ్యంగా తనపై ఉన్న “కాపు ముద్ర”ను పక్కనపెట్టి, అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలన్నదే ఆమె ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కులం, వర్గం, రాజకీయాల ప్రస్తావన లేకుండా… కేవలం ప్రజల సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా దాన్ని పట్టించుకుంటానని, సాధ్యమైనంత వరకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని ఇటీవలే ఆమె ప్రకటించడం గమనార్హం. ఇదే విషయాన్ని రాధా రంగా మిత్రమండలి సభ్యులకు కూడా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఆశాకిరణ్ తొలి ప్రజా ప్రయాణాన్ని ఏలూరు లేదా తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలన్న ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈనెల 26న రంగా వర్ధంతి ఉండటంతో… ఆ రోజునుంచే ప్రజల్లోకి రావడం రాజకీయంగా, భావోద్వేగపరంగా కూడా బలమైన సంకేతంగా మారనుంది. ఈ ప్రయాణంలో నిధుల సమీకరణ, కార్యకర్తల సమీకరణ, రాధా–రంగా మిత్రమండలి ఐక్యత వంటి అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ముందుగా తనను తాను నిరూపించుకోవాలి… ఆ తర్వాతే రాజకీయంగా పెద్ద అడుగు వేయాలి అన్నది ఆశాకిరణ్ వ్యూహం. వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక పార్టీలో చేరడం దాదాపు ఖాయమే. కానీ అంతకుముందే తన తండ్రి వంగవీటి రంగా నుంచి వచ్చిన వారసత్వ సానుభూతిని మళ్లీ ప్రజల్లో బలంగా రేకెత్తించగలిగితే అది తనకు రాజకీయంగా పెద్ద బలమవుతుందన్న అంచనాలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈనెల 26 నుంచి పార్టీకి సంబంధం లేకుండా, పూర్తిగా వ్యక్తిగత ఇమేజ్ నిర్మాణంతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆశాకిరణ్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రాజకీయాలకతీతంగా ఎంతమంది ఆమె వెంట నడుస్తారు? రంగా పేరు మళ్లీ గ్రౌండ్ లెవెల్‌లో ఎంత బలంగా వినిపిస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… వంగవీటి ఆశాకిరణ్ ఎంట్రీతో రాజకీయ వాతావరణం కాస్త వేడెక్కనుందనే మాట!